Balakrishna vs Ravi Teja: కిక్ వ‌ర్సెస్ స‌మ‌ర‌సింహారెడ్డి - రిలీజ్‌లో...రీ రిలీజ్‌లో ర‌వితేజ‌కు బాల‌కృష్ణ పోటీ-balakrishna samarasimha reddy and ravi teja kick re release in theaters on one day gap ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Vs Ravi Teja: కిక్ వ‌ర్సెస్ స‌మ‌ర‌సింహారెడ్డి - రిలీజ్‌లో...రీ రిలీజ్‌లో ర‌వితేజ‌కు బాల‌కృష్ణ పోటీ

Balakrishna vs Ravi Teja: కిక్ వ‌ర్సెస్ స‌మ‌ర‌సింహారెడ్డి - రిలీజ్‌లో...రీ రిలీజ్‌లో ర‌వితేజ‌కు బాల‌కృష్ణ పోటీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 22, 2024 09:02 AM IST

Balakrishna vs Ravi Teja: రీ రిలీజ్ సినిమాల‌తో బాల‌కృష్ణ‌, ర‌వితేజ ఒకే రోజు గ్యాప్‌లో బాక్సాఫీస్ బ‌రిలో నిల‌బోతున్నారు. ర‌వితేజ కిక్ మార్చి 1న రిలీజ్ అవుతోండ‌గా...బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి మార్చి 2న విడుద‌ల కాబోతోంది.

కిక్ వ‌ర్సెస్ స‌మ‌ర‌సింహారెడ్డి
కిక్ వ‌ర్సెస్ స‌మ‌ర‌సింహారెడ్డి

Balakrishna vs Ravi Teja: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ రోజురోజుకు పెరుగుతోంది. నెల‌కు ప‌ది, ప‌దిహేను వ‌ర‌కు రీ రిలీజ్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాల జాబితాలో టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ ర‌వితేజ కిక్‌, బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి చేరాయి. ర‌వితేజ కిక్ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తోంది. బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి మూవీ మార్చి 2న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.

అప్పుడు మిత్రుడు...ఇప్పుడు స‌మ‌ర‌సింహారెడ్డి...

కిక్ మూవీ 2009లో మే ఫ‌స్ట్ వీక్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అదే టైమ్‌లో బాల‌కృష్ణ మిత్రుడు కూడా రిలీజైంది. వారం గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా...మిత్రుడు డిజాస్ట‌ర్ అయ్యింది. మ‌ళ్లీ కిక్ రీ రిలీజ్ టైమ్‌లో బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి విడుద‌ల అవుతోంది. ఒకే రోజు గ్యాప్‌లో కిక్‌, స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలు మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. రిలీజ్‌లో, రీ రిలీజ్‌లో ర‌వితేజ కిక్ సినిమాకు పోటీగా బాల‌కృష్ణ సినిమాలు రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కిక్ క‌ల్ట్ మూవీ...

కిక్ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వితేజ కెరీర్‌లో క‌ల్ట్ మూవీస్‌లో ఒక‌టిగా కిక్ నిలిచింది. ర‌వితేజ‌ను స్టార్ లీగ్‌లో చేర్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇందులో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల‌ను అల‌రించింది.

ర‌వితేజ‌, బ్ర‌హ్మానందం మ‌ధ్య వ‌చ్చిన కామెడీ సీన్స్ సినిమా విజ‌యానికి కీల‌కంగా నిలిచింది. కిక్ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టించింది. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ మూవీ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్ ట్రైల‌ర్‌ను గురువారం విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

ఇర‌వై ఐదేళ్ల త‌ర్వాత‌....

బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి మూవీ 1999లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బీ గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు ఆరు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఆ రోజుల్లోనే 16 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 72 థియేట‌ర్ల‌లో వంద రోజుల ఈ మూవీ ఆడింది.

తెలుగు రాష్ట్రాల్లోని ఓ థియేట‌ర్‌లో ఏకంగా సంవ‌త్స‌రం పాటు ఆడి రికార్డ్ నెల‌కొల్పింది. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో సిమ్రాన్‌, అంజ‌లా జ‌వేరి హీరోయిన్లుగా న‌టించారు. సంఘ‌వి కీల‌క పాత్ర చేసింది. ఈ సినిమాకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌తో క‌లిసి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. దాదాపు ఇర‌వై ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

ఎన్‌బీకే 109...

ఇటీవ‌లే ఈగ‌ల్‌తో స‌క్సెస్ అందుకున్న ర‌వితేజ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భ‌గ‌వంత్ కేస‌రి వ‌రుస‌గా మూడోసారి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరాడు బాల‌కృష్ణ‌.

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోన్నాడు బాల‌కృష్ణ‌. ఎన్‌బీకే 109 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో యానిమ‌ల్ ఫేమ్ బాడీడియోల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

Whats_app_banner