Sound Party Review: సౌండ్ పార్టీ రివ్యూ.. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-vj sunny sound party review and rating in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sound Party Review: సౌండ్ పార్టీ రివ్యూ.. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Sound Party Review: సౌండ్ పార్టీ రివ్యూ.. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2023 07:10 PM IST

Sound Party Movie Review: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ నటించిన లేటేస్ట్ మూవీ సౌండ్ పార్టీ. సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కిన సౌండ్ పార్టీ మూవీ రివ్యూలోకి వెళితే..

బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ సౌండ్ పార్టీ మూవీ రివ్యూ
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ సౌండ్ పార్టీ మూవీ రివ్యూ

టైటిల్: సౌండ్ పార్టీ

నటీనటులు: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ నరిపెద్ది, అలీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సప్తగిరి, చలాకి చంటి, మిర్చి ప్రియ, అశోక్ కుమార్, మాణిక్ రెడ్డి, రేఖ పర్వతాల తదితరులు

సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి

ఎడిటింగ్: జి. అవినాష్

సంగీతం: మోహిత్ రెహమానిక్

నిర్మాత: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర

రచన, దర్శకత్వం: సంజయ్ శేరి

విడుదల తేది: నవంబర్ 24, 2023

Sound Party Review In Telugu: ట్రైలర్, సాంగ్స్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా సౌండ్ పార్టీ. సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ సౌండ్ పార్టీ మంచి అంచనాలతో నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ టైటిల్ విన్నర్ వీజే సన్నీ, ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ జోడీగా ఫన్ రైడ్‌ మూవీగా వచ్చిన సౌండ్ పార్టీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

డాలర్ కుమార్ (వీజే సన్నీ), కుబేర్ కుమార్ (అప్పాజీ శివన్నారాయణ) ఇద్దరు తండ్రీకొడుకులు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరిద్దరు సులభంగా కోటీశ్వరులు కావాలని, తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించాలని కలలు కంటుంటారు. అలా ఈజీ మనీ కోసం అనేక రకాల వ్యాపారాలు చేసి నష్టపోవడమే కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారు. దాని నుంచి బయట పడేందుకు అడ్డ దారులు తొక్కుతారు.

ఈ క్రమంలోనే దొంగతనం కేసు మీద వేసుకుని 2 నెలలు జైళ్లో ఉంటే రూ. 2 కోట్లు ఇస్తానని తండ్రీకొడుకులకు ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) ఆఫర్ ఇస్తాడు. డబ్బుకు ఆశపడి డాలర్ కుమార్, కుబేర్ కుమార్ ఒప్పుకుని జైలుకు వెళ్తారు. కానీ, అది దొంగతనం కేసు కాదు, రేప్ కేసు అని తెలుస్తుంది.

ట్విస్టులు

తండ్రీకొడుకులకు జైలుకు వెళ్లిన తర్వాత ఎదురైన సమస్యలు ఏంటీ? వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎమ్మెల్యే వర ప్రసాద్ వారిని మోసం చేయడానికి గల కారణాలు ఏంటీ? తండ్రికొడుకులు ఆ నేరం నుంచి బయట పడ్డారా? రెండు కోట్లు వచ్చాయా? వాళ్లు కలలు కన్నట్లుగా కోటీశ్వరులు అయ్యారా? అనేది తెలియాలంటే కచ్చితంగా సౌండ్ పార్టీ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా కోటీశ్వరులు కావాలని చాలా మంది కలలు కంటుంటారు. అలాంటి సినిమాలు కూడా తెలుగు వెండితెరపై చాలా వచ్చాయి. అలాంటి కాన్సెప్ట్‌తో ఫుల్ లెంత్ కామెడీ ట్రాక్‌తో సౌండ్ పార్టీని నడిపించారు డైరెక్టర్ సంజయ్ శేరి. స్టోరీ రెగ్యులర్ అయినప్పటికీ తండ్రీకొడుకులు ఇద్దరూ ఈజీ మనీ కోసం ఆశపడటం, బిట్ కాయిన్‌తో కామెడీ పండించడం వంటి అంశాలు కొత్తగా అనిపిస్తాయి.

కామెడీని నమ్ముకుని

డబ్బు కోసం వివిధరకాలుగా అడ్డదారులు తొక్కడం, అవి బెడిసి కొట్టడం వంటివి ఇదివరకు చూసిన అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా లేదా అన్నది ముఖ్యం. సౌండ్ పార్టీ మూవీలో ఈ కథను కామెడీ వేలో చూపించి ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు సఫలం అయ్యారనే చెప్పొచ్చు. కామెడీని నమ్ముకుని కథను రాసుకున్న డైరెక్టర్ సక్సెస్ అయినట్లేనని చెప్పొచ్చు.

ఇంటర్వెల్ ట్విస్ట్

అయితే, కొన్ని సీన్స్ బాగున్నప్పటికి కథకు ఉన్న కావాలనే జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. కుబేర్ ఫ్యామిలీ నేపథ్యం తెలియజేస్తూ వారి పాత్రలు ఎలా ఉంటాయో చూపించారు. ఇక డబ్బు కోసం తండ్రీ కొడుకులు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని చోట్ల పంచ్‌లు బాగా పేలాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. అది సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

బిట్ కాయిన్ ఎపిసోడ్

సెకండాఫ్‌లో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. జైలు నుంచి తండ్రీకొడుకుల తప్పించుకునే సన్నివేశాలు, పత్తి సతీష్‌గా చలాకీ చంటి, సైంటిస్ట్‌గా అలీ బాగానే నవ్వించారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ఓ సీన్‌ను స్ఫూఫ్ చేశారు. అది సినిమాకు బాగా ప్లస్ అయింది. బిట్ కాయిన్ ఎపిసోడే మంచి ట్విస్ట్ ఇస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్‌గా సిల్లీగా అనిపిస్తాయి. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే మాత్రం సౌండ్ పార్టీ నవ్విస్తుంది.

ఎవరెలా చేశారంటే:

తండ్రీకొడుకులుగా శివన్నారాయణ, వీజే సన్నీ అదరగొట్టారు. మూవీకి మేజర్ హైలెట్ వీళ్లిద్దరి పర్ఫామెన్స్. తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. తండ్రీకొడుకుల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ కూడా చాలా బాగా చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ తెరపై అందంగా, నటనతో తన పాత్రకు న్యాయం చేసింది. అలీ కనిపించిన ఒకటి రెండు సీన్లలో నవ్వించాడు. ఎమ్మెల్యేగా పృథ్వీ అలరించాడు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు ఆకట్టుకున్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే?

సౌండ్ పార్టీ సినిమా నిర్మాణ విలువలు, సాంకేతికపరంగా బాగున్నాయి. బడ్జెట్‌లో సినిమాను క్వాలిటీతో రూపొందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు బాగున్నాయి. పాటలు, బీజీఎమ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే లాజిక్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పక్కన పెట్టి కామెడీ కోసం వెళ్లాలనుకుంటే సౌండ్ పార్టీ మూవీపై లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

Whats_app_banner