Vijay Sethupathi: రిపోర్టర్‌కు క్లాస్ పీకిన విజయ్ సేతుపతి.. ఇదీ కారణం
Vijay Sethupathi: తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఓ రిపోర్టర్ కు క్లాస్ పీకాడు. తన నెక్ట్స్ మూవీ మెర్రీ క్రిస్మస్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ఘటన జరిగింది.
Vijay Sethupathi: విలక్షణ నటుడిగా తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు, తర్వాత హిందీ వారికి కూడా పరిచయమైన నటుడు విజయ్ సేతుపతి. ఇప్పుడు కత్రినా కైఫ్ తో అతడు మెర్రీ క్రిస్మస్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్య చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో అతడు ఓ రిపోర్టర్ పై అసహనం వ్యక్తం చేశాడు.
హిందీని తమపై బలవంతంగా రుద్దొద్దు అని తమిళనాడులో చాన్నాళ్లుగా ఉద్యమాలు నడుస్తున్న సంగతి తెలుసు కదా. ఇదే విషయంపై విజయ్ సేతుపతిని ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. దీనిపై అతడు అసహనం వ్యక్తం చేస్తూ.. గతంలో ఆమిర్ ఖాన్ ను కూడా ఇదే ప్రశ్న అడిగావని, పదేపదే ఈ ప్రశ్న అడగడం వల్ల నీకు ఏం వస్తుందని అని విజయ్ సీరియస్ అయ్యాడు.
విజయ్ అసహనానికి ఇదీ కారణం
మెర్రీ క్రిస్మస్ మూవీ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ అసలు హిందీని నేర్చుకోవడం అవసరమా అని విజయ్ సేతుపతిని ప్రశ్నించాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. "హిందీని ఓ భాషగా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఆమిర్ ఖాన్ సర్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న నువ్వు అడిగావు.
నిజమే కదా? ప్రతిసారీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతావు? ఈ ప్రశ్న నన్ను అడగడం వల్ల ఏం ప్రయోజనం? వాళ్లు హిందీ నేర్చుకోకూడదు అని అనలేదు. హిందీని బలవంతంగా మాపై రుద్దొద్దు అని మాత్రమే అన్నారు. ఇక్కడున్న చాలా మంది హిందీ నేర్చుకుంటున్నారు. ఎవరూ మమ్మల్ని ఆపలేదు. మంత్రి త్యాగరాజన్ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. వెళ్లి చూడు" అని ఆ రిపోర్టర్ కు క్లాస్ పీకాడు.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో విజయ్ ప్రస్తుతం నడుస్తున్న నార్త్, సౌత్ సినిమాల చర్చపైనా స్పందించాడు. "ఓ టీజర్ లాంచ్ సమయంలో నార్త్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య ఉన్న గోడ గురించి అడిగారు. అప్పుడు స్టేజ్ పై ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఓటీటీ వచ్చిన తర్వాత ఆ గోడకు బీటలు వారాయి అన్నాడు. ఇప్పుడది స్పష్టంగా కనిపిస్తోంది" అని విజయ్ అన్నాడు.
బాలీవుడ్ లో అంధాధున్ లాంటి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో మెర్రీ క్రిస్మస్ మూవీ వస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమాను తమిళంతోపాటు హిందీలోనూ ఒకేసారి షూట్ చేశారు. అయితే హిందీ, తమిళం కోసం వేర్వేరు నటీనటులు ఉండటం విశేషం.
హిందీలో విజయ్, కత్రినాతోపాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమా కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. ఇక తమిళంలో మాత్రం విజయ్, కత్రినా కాకుండా రాధికా శరత్ కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ లాంటి వాళ్లు నటించారు. గతేడాది డిసెంబర్ 20వ తేదీనే ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది.