ED Questions Vijay deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియెన్స్‌ను ఆకట్టుకోకపోవడంతో వసూళ్లపై కూడా తీవ్రంగా ప్రభావం పడింది. ఆ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాను తెరెకెక్కించిన పూరి జగన్నాథ్ ఇంటి ఎదుటు ధర్నాకు పూనుకున్నారు. ఆ గొడవ ఇటీవలే తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మరోసారి లైగర్ టీమ్‌కు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూపంలో చుక్కెదురైంది. ఈ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. లైగర్ బృందంలో ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు.
ఇప్పటికే చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి ఈడీ విచారణకు హాజరవగా.. తాజాగా హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. లైగర్ చిత్రానికి సంబంధించిన వ్యవహారంలో దుబాయ్‌కి డబ్బులు పంపించి అక్కడ నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గతంలో గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందుకోసం లైగర్ నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
మంగళవారం ఉదయం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యాడు. లైగర్ సినిమా లావాదేవీలకు సంబంధించి అతడిని అధికాకురులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం