Kushi: ‘ఖుషి’ రెండో పాట రిలీజ్‍కు డేట్ ఫిక్స్.. విజయ్ దేవరకొండ - సమంత రొమాంటిక్ పోస్టర్
Kushi: ఖుషి మూవీ నుంచి రెండో పాట విడుదలకు డేట్ ఖరారైంది. విజయ్ దేవరకొండ, సమంత ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
Kushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్‍లో ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా రూపొందుతోంది. గతేడాది లైగర్ మూవీతో భారీ పరాజయం చూశాడు విజయ్. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఈ ఏడాది నిరాశపరిచింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ డ్రామా ఖుషి మూవీ తెరకెక్కుతోంది. కాగా, ఖుషి సినిమా నుంచి రెండో పాట సిద్ధమైంది. ఈ సాంగ్ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది.
ఖుషి సినిమా నుంచి ‘ఆరాధ్య’ అనే రెండో పాటను జూలై 12న విడుదల చేయనున్నట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ పాట ప్రోమోను జూలై 10న రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. “మళ్లీ మళ్లీ వినాలనిపించే మరొక మెలోడియస్ సాంగ్‍ను మీకు అందిస్తున్నాం. ఖుషి సెకండ్ సింగిల్ ఆరాధ్య జూలై 12న రానుంది. సాంగ్ ప్రోమో జూలై 10న వస్తుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఖుషి మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
రెండో పాట విడుదల గురించి చిత్ర యూనిట్ పోస్ట్ చేసిన పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ - సమంత రొమాంటిక్‍గా ఉన్నారు. ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ, చేతిలో చేయి వేసుకొని మైమరిచి పోయే ప్రేమికుల్లా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఉంది. వారి మధ్య కెమిస్ట్రీ కూడా మెరుగ్గా ఉంది.
ఆరాధ్య పాటను తెలుగులో సిధ్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద పాడారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటను తెలుగులో స్వయంగా తానే రాశాడు. ఆరాధ్య పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రానుంది. అయితే, భాషను బట్టి గాయకులు, లిరిక్ రైటర్స్ వేర్వేరుగా ఉన్నారు.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది. అయితే, ఇప్పటి నుంచే ఈ మూవీ ప్రమోషన్‍లను చిత్ర యూనిట్ జోరుగా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ చాలా పాపులర్ అయింది. మంచి స్పందనను దక్కించుకుంటోంది.
ఖుషి సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.