Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్: వివరాలివే-tollywood actor thiruveer marries kalpana rao ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్: వివరాలివే

Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 21, 2024 08:57 PM IST

Thiruveer Marriage: టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఏడడుగులు వేశారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన నేడు పెళ్లాడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్
Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్

Thiruveer Marriage: టాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ వివాహం చేసుకున్నారు. చాలాకాలంగా ప్రేమిస్తున్న కల్పన రావును నేడు (ఏప్రిల్ 21) ఆయన పెళ్లాడారు. ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది.

కొత్త ఆరంభం అంటూ..

తన పెళ్లి ఫొటోలను తిరువీర్.. ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్‍లను క్యాప్షన్‍గా పెట్టారు. హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. కుండలో ఉంగరం ఆట ఆడిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

పెళ్లి చేసుకున్న తిరువీర్‌కు చాలా మంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఆయనకు విషెస్ చెబుతున్నారు.

నాటకాల నుంచి సినిమాలు.. తిరువీర్ కెరీర్

కెరీర్ ఆరంభంలో చాలా నాటకాల్లో తిరువీర్ నటించారు. కొంతకాలం రేడియో జాకీగానూ పని చేశారు. 2016లో బొమ్మలరామారం చిత్రంతో తిరువీర్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ మూవీలో ఓ పాత్ర పోషించారు. అనంతరం ఏ మంత్రం వేశావే, శుభలేఖలు సినిమాల్లో కనిపించారు. అయితే, జార్జిరెడ్డి చిత్రంతో తిరువీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లలన్ సింగ్ పాత్రలో ఆ మూవీలో మెప్పించారు. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన మల్లేశం, పలాస 1978 సినిమాల్లో కీలకపాత్రలు చేశారు తిరువీర్. టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రసంశలు పొందారు. 

మసూదతో బిగ్‍బ్రేక్

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన టక్ జగదీశ్ చిత్రంలో నెగెటివ్ పాత్రలో తిరువీర్ నటించారు. ఈ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే, హారర్ మూవీ మసూద (2022)తో తిరువీర్‌కు కెరీర్లో బిగ్ బ్రేక్ వచ్చింది. ఆ చిత్రంలో తిరువీర్ హీరోగా నటించారు. ఆ మూవీ కమర్షియల్‍గానూ మంచి హిట్ అయింది. దీంతో హీరోగా నిలదొక్కుకున్నారు. ఇక, గతేడాది పరేషాన్ చిత్రంతోనూ తిరువీర్ మెప్పించారు. తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో వచ్చిన ఆ కామెడీ మూవీలో ఆయన యాక్టింగ్ ఆకట్టుకుంది. గతేడాది కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‍లోనూ కీలకపాత్ర చేశారు తిరువీర్.

తిరువీర్ నటించిన మోక్షపట్నం, పారాహుషార్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భగవంతుడు చిత్రం చేస్తున్నారు.

భగవంతుడు సినిమా గురించి..

 భగవంతుడు చిత్రం పీరియడ్ యాక్షన్ చిత్రంగా రానుందని తెలుస్తోంది. ఈ మూవీలో తిరువీర్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‍ను దగ్గుబాటి రానా మార్చిలో శివరాత్రి సందర్భంగా రివీల్ చేశారు. కాళ్లకు గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తున్నట్టుగా ఈ లుక్ ఉంది. భగవంతుడు చిత్రానికి జీజీ విహారి దర్శకత్వం వహిస్తున్నారు. 

భగవంతుడు చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ పతాకంపై నారాయణ దాస్  నారంగ్, రవి పనాస ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రవికుమార్ పనాన నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కేపీ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. 

IPL_Entry_Point