Tillu Part 3: టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు 3.. కన్ఫర్మ్ చేసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ
Siddhu Jonnalagadda About Tillu 3: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో టిల్లు పార్ట్ 3పై ఆసక్తి నెలకొంది. అయితే టిల్లు 3పై హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
Siddhu Jonnalagadda About Tillu 3: ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీక్వెల్ మూవీ 'టిల్లు స్క్వేర్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే, మూవీ విడుదలకంటే ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు పార్ట్ 3పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పాడు.
డీజే టిల్లు లాంటి భారీ విజయానికి సీక్వెల్‌గా సినిమా కదా. ఏమైనా ఒత్తిడి ఉందా?
డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్‌పుట్ ని అందించడానికి కృషి చేశాం.
ఈ సీక్వెల్ పాత్రకి కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకి కొనసాగింపుగా ఉంటుందా?
రెండింటికి కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్‌లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్‌ప్రైజ్ లు, షాక్‌లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్‌గా నవ్విస్తాడు.
డీజే టిల్లులో మీకు వన్ మ్యాన్ షో అనే పేరు వచ్చింది. ఇప్పుడు మీకు అనుపమ లాంటి స్టార్ హీరోయిన్ తోడయ్యారు. ఆమె డామినేషన్ ఏమైనా ఉంటుందా?
అలా ఏముండదు. కథలో ఏ పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది. డీజే టిల్లులో కూడా హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం.
సీక్వెల్‌కి దర్శకుడు ఎందుకు మారాడు?
సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్‌ను దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.
పార్ట్-3 కూడా ఉంటుందా?
సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది.