The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..-the broken news season 2 review interesting newsroom drama with a twist in climax a must watch web series on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

Hari Prasad S HT Telugu
May 06, 2024 10:19 AM IST

The Broken News Season 2 Review: తాజాగా జీ5 ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2. ఈ న్యూస్ రూమ్ డ్రామా క్లైమ్యాక్స్ లో ఇచ్చే ట్విస్టుతోపాటు చాలా మంది కళ్లు తెరిపించేలా సాగింది.

క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..
క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

The Broken News Season 2 Review: ప్రజాస్వామ్యంలో ప్రజలే హీరోలు.. ఏ నాయకుడిపై అంధభక్తి వద్దు అనే సందేశంతో సాగిన వెబ్ సిరీస్ బ్రోకెన్ న్యూస్ సీజన్ 2. గతంలో వచ్చిన తొలి సీజన్ రెండు న్యూస్ ఛానెల్స్ మధ్య పోటీ, పతనమవుతున్న జర్నలిజం నైతిక విలువల గురించి ప్రస్తావించగా.. ఈ రెండో సీజన్ కూడా ఆ అంశాన్ని మరింత లోతుగా చర్చిస్తూనే రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న అంధ విశ్వాసానని కూడా ప్రశ్నిస్తూ సాగింది.

వెబ్ సిరీస్: ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2

నటీనటులు: సొనాలీ బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియ పిల్గాంకర్, అక్షయ్ ఒబెరాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా

ఓటీటీ: జీ5 (Zee5 OTT)

డైరెక్టర్: వినయ్ వైకుల్

ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 స్టోరీ ఏంటి?

ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే మొదలైంది. ప్రభుత్వం ప్రజల ప్రైవసీని దెబ్బతీసేలా తీసుకొచ్చిన ఆపరేషన్ అంబ్రెల్లా చట్టం, తన ప్రత్యర్థి ఛానెల్ అరాచకాలను ప్రశ్నిస్తున్న రాధా భార్గవ్ (శ్రియా పిల్గాంకర్) అనే సీనియర్ జర్నలిస్టును దేశద్రోహి అంటూ జైల్లో వేయడంతో సీజన్ 1 ముగుస్తుంది. అక్కడి నుంచే ఈ సీజన్ 2 ప్రారంభమైంది. ఆమెను జైలు నుంచి విడిపించడంలో ఆవాజ్ భారతీ న్యూస్ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అమీనా ఖురేషీ (సొనాలీ బింద్రే) విజయవంతమవుతుంది.

అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత రాధా భార్గవ్ జర్నలిజం తీరే మారిపోతుంది. తనకు ఈ గతి పట్టించిన ప్రత్యర్థి న్యూస్ ఛానెల్ ఎడిటర్ దీపాంకర్ సన్యాల్ (జైదీప్ అహ్లావత్), రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యంగా మాత్రమే ఆమె కథనాలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా తనకు అండగా నిలిచిన అమీనాను కూడా పక్కన పెట్టేస్తుంది. జర్నలిజం ప్రాథమిక లక్ష్యాలను కూడా మరచిపోతుంది.

మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే మరో సంచలన కథనాన్ని పట్టుకుంటుంది అమీనా ఖురేషీ. అయితే ఆ కథనం ఆమెతోపాటు ఆవాజ్ భారతీ ఛానెల్ ప్రస్తానాన్ని ఎలా మార్చబోతోంది? ఇందులో ప్రత్యర్థి ఛానెల్ జోష్ 27X7 ఎడిటర్ దీపాంకర్ సన్యాల్ పోషించే పాత్ర ఏంటి? ఆ సంచలన కథనం ముగింపు ఎటువైపు అన్నది ఈ ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2లో చూడొచ్చు.

ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 ఎలా ఉందంటే?

అక్కడక్కడా కొన్ని లోపాలు.. కథనం పక్కదారి పట్టినట్లుగా అనిపించడం తప్ప ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్. ఈ కాలం రాజకీయాలు, న్యూస్ ఛానెల్స్ మధ్య పోటీ, ఓ రాజకీయ పార్టీ, ఓ రాజకీయ నేతపై ప్రజల్లో ఉండే అంధ విశ్వాసం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది కళ్లకు కట్టినట్లు ఈ వెబ్ సిరీస్ చూపించింది.

తాను చెప్పాలనుకుంటున్న సందేశాన్ని స్పష్టంగా చెప్పడంలో మాత్రం మేకర్స్ విజయవంతమయ్యారనే చెప్పాలి. ఇక చివరి ఎపిసోడ్ల వచ్చే అదిరిపోయే ట్విస్ట్ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే హీరోలు.. ఏ రాజకీయ పార్టీని, నేతనూ గుడ్డిగా ఫాలో కావద్దు.. నిజానిజాలను తెలుసుకొని ముందుకు సాగండి అనే సందేశంతో ఈ రెండో సీజన్ ముగుస్తుంది.

ఎవరెలా చేశారంటే?

ఈ బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో హైలైట్ అంటే సొనాలి బింద్రేనే. ఒకప్పుడు తన అందచందాలతో బాలీవుడ్, టాలీవుడ్ లను ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సిరీస్ లో నైతిక విలువలకు కట్టుబడి పని చేసే జర్నలిస్టు పాత్రలో జీవించేసింది. తప్పుడు ప్రచారం, ఓ పార్టీని, నేతను మోయడమే ఓ న్యూస్ ఛానెల్ పని కాదు.. ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా ప్రజలకు వాస్తవాలను అందించడమే అవి చేయాల్సిన పని అని నమ్మే జర్నలిస్టు పాత్ర సొనాలీకి సరిగ్గా సూటయింది.

ఇక జైదీప్ అహ్లావత్ తనదైన స్టైల్లో ఇరగదీశాడు. న్యూస్ ఛానెల్ పేరుతో తప్పుడు ప్రచారాన్ని ప్రజల మెదళ్లలో ఎలా నాటడానికి ప్రయత్నిస్తారో జైదీప్ పోషించిన దీపాంకర్ సన్యాల్ అనే సీనియర్ జర్నలిస్ట్ పాత్రను చూస్తే స్పష్టమవుతుంది. ఓవరాల్ గా ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 ఓ పర్ఫెక్ట్ న్యూస్ రూమ్ డ్రామా. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.

IPL_Entry_Point