Telugu TV Serials TRP Ratings: టాప్ 10 తెలుగు సీరియల్స్ ఇవే.. బ్రహ్మముడికి గట్టి పోటీ ఇస్తున్న కార్తీకదీపం 2
TV Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. గత వారం ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిన బ్రహ్మముడి కాస్త కిందికి దిగగా.. తాజా రేటింగ్స్ లో కార్తీకదీపం 2 టాప్ సీరియల్ కు గట్టి పోటీ ఇస్తోంది.
TV Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే మరోసారి టీఆర్పీ రేటింగ్స్ లో సత్తా చాటాయి. అయితే ఎప్పటిలాగే ఈ రెండు ఛానెల్స్ లో స్టార్ మాదే పైచేయి అయింది. ఈ ఛానెల్ కు చెందిన ఆరు సీరియల్సే టాప్ 6లో ఉన్నాయి. ఇక మిగిలిన నాలుగు స్థానాలను జీ తెలుగు సీరియల్స్ ఆక్రమించాయి. ఈటీవీ, జెమిని టీవీలకు చెందిన సీరియల్స్ 40వ వారం రేటింగ్స్ లోనూ చాలా వెనుకబడ్డాయి. తాజా రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా ఛానెల్ మరోసారి సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో సత్తా చాటింది. ఈ ఛానెల్లో వచ్చే బ్రహ్మముడి సీరియలే టాప్ లో ఉంది. అయితే 39వ వారంతో పోలిస్తే 40వ వారం ఆ సీరియల్ టీఆర్పీ కాస్త తగ్గింది. తాజాగా 12.41 రేటింగ్ తో బ్రహ్మముడి నంబర్ 1 సీరియల్ గా నిలిచింది.
ఇక కార్తీకదీపం 2 సీరియల్ ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. ఆ సీరియల్ 11.64 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో మరోసారి గుండెనిండా గుడిగంటలు (10.04) నిలవగా.. ఇంటింటి రామాయణం 9.99 రేటింగ్ తో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఐదు, ఆరు స్థానాల్లో చిన్ని (9.92), మగువ ఓ మగువ (8.14) ఉన్నాయి. ఇలా టాప్ 6లో అన్నీ స్టార్ మాకు చెందిన సీరియల్సే ఉండటం విశేషం.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. మరోసారి పడమటి సంధ్యారాగం టాప్ లో ఉంది. ఈ సీరియల్ కు 7.28 రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఏడో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో నిండు నూరేళ్ల సావాసం (6.89), త్రినయని (6.82), జగద్ధాత్రి (6.8), మేఘ సందేశం (6.73) ఉన్నాయి. మొత్తంగా చూస్తే టాప్ 10 సీరియల్స్ లో నాలుగు జీ తెలుగు ఛానెల్ కు చెందినవి ఉండటం విశేషం.
ఈటీవీ, జెమిని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఈటీవీ సీరియల్స్ గత వారంతో పోలిస్తే 40వ వారంలో కాస్త మెరుగైన రేటింగ్స్ పొందాయి. ఈ ఛానెల్లో వచ్చే రంగులరాట్నం 3.72 రేటింగ్ తో టాప్ లో కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో మనసంతా నువ్వే 3.18 రేటింగ్ తో ఉండగా.. గువ్వగోరింక 2.93తో మూడో స్థానంలో, రావోయి చందమామ 2.50తో నాలుగో స్థానంలో, శతమానం భవతి 1.86తో ఐదో స్థానంలో ఉన్నాయి.
జెమిని సీరియల్స్ విషయానికి వస్తే 40వ వారం కూడా పెద్దగా మార్పేమీ లేదు. మరోసారి శ్రీమద్ రామాయణం సీరియల్ 1.27 రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొత్తగా రెక్కలొచ్చెనా (0.98), భైరవి (0.90), సివంగి (0.88), నువ్వే కావాలి (0.74) సీరియల్స్ నిలిచాయి.