Bigg Boss 8 Telugu TRP: మళ్లీ బిగ్ బాసే టాప్.. తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు మరోసారి తెలుగు టీవీ షోల టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా స్టార్ మా, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన టీవీ షోలే టీఆర్పీల్లో టాప్ 10లో ఉన్నాయి.
Bigg Boss 8 Telugu TRP: తెలుగు టీవీ షోలకు సంబంధించి 38వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈసారి కూడా బిగ్ బాస్ 8 తెలుగు తొలి స్థానంలో నిలిచింది. ఈ రియాల్టీ షో కొత్త సీజన్ మొదలైనప్పటి నుంచీ వీక్ డేస్, వీకెండ్ షోలలో దూసుకెళ్తోంది. మిగిలిన షోలతో పోలిస్తే.. దీనికే ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి.
తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు టీవీ షోలకు సంబంధించి 38వ వారం టీఆర్పీ రేటింగ్స్ ను బార్క్ రిలీజ్ చేసింది. ఇందులో అన్నింటికంటే ఎక్కువగా బిగ్ బాస్ 8 తెలుగు వీకెండ్ షో 5.39 రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచింది. ఇక కేవలం అర్బన్ ఏరియా రేటింగ్ చూసుకుంటే 6.41 సాధించడం విశేషం. రెండో స్థానంలో స్టార్ మా ఛానెల్ కే చెందిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఉంది.
ఈ షోకి 4.34 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలోనూ బిగ్ బాస్ వీక్ డేస్ షో 3.99 రేటింగ్ తో నిలిచింది. చాలా రోజుల పాటు ఈ షోలలో టాప్ లో నిలిచిన ఈటీవీకి చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 3.64 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక ఈటీవీలోనే వచ్చే ఢీ సెలబ్రిటీ స్పెషల్ డ్యాన్స్ షో 3.22 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉంది.
జీ తెలుగు ఛానెల్ షో అయిన డ్రామా జూనియర్స్ 2.99 రేటింగ్ తో ఆరో స్థానం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఈటీవీకి చెందిన షోలే ఉండటం విశేషం. జబర్దస్త్ కు 2.6 రేటింగ్, పాడుతా తీయగా షోకి 1.84, సుమ అడ్డాకి 1.79 రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈసారి కూడా ఫ్యామిలీ స్టార్స్ షోకి సంబంధించిన రేటింగ్ రాలేదు. సాధారణంగా ఈ షో కూడా టాప్ రేటింగ్స్ సాధించే వాటిలో ఒకటిగా ఉంటోంది.
బిగ్ బాస్ 8 తెలుగు
బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిజానికి గత సీజన్ల కంటే ఈసారి ఈ షో అంత ఆసక్తికరంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నా.. రేటింగ్స్ విషయంలో మాత్రం మొదటి నుంచీ దూసుకెళ్తూనే ఉంది. ఈ షోని రక్తి కట్టించడానికి నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు.
కంటెస్టెంట్లతో రకరకాల గేమ్స్ ఆడించడం మొదలు నామినేషన్లు, ఎలిమినేషన్లలో హైడ్రామా.. కొత్త మిడ్ వీక్ ఎవిక్షన్, వైల్డ్ కార్డు ఎంట్రీస్ తీసుకురాబోతుండటం.. ఇలా షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో టీఆర్పీ రేటింగ్స్ కాస్త హెచ్చుతగ్గులు ఉంటున్నా.. మిగిలి షోల కంటే టాప్ లోనే ఉంటూ వస్తోంది.
ఈ సీజన్లో మొత్తం 14 మంది హౌజ్ లోకి ఎంటరవగా.. ఇప్పటికే ఐదుగురు వెళ్లిపోయారు. మిగిలిన తొమ్మిది మందిలో మరొకరు వీకెండ్ షోలో వెళ్లిపోనున్నారు. కొత్తగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌజ్ లోకి రాబోతున్నారు. దీంతో షో మరింత రక్తికట్టేలా సాగనుంది.