Radhika Sarathkumar: నటి క్యార్‌వాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, సెట్స్‌లోనే నటులు చూసేవారు.. రాధిక సంచలన ఆరోపణ
#MeToo in Malayalam Cinema: మాలీవుడ్‌లో మీటూ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత సీనియర్ నటీమణులు సైతం బయటికి వచ్చి తమకి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల్ని చెప్తున్నారు.
మలయాళ సినిమా షూటింగ్ సెట్స్‌లో క్యార్‌వాన్‌లో ఉన్న నటిని రహస్య కెమెరాలతో రికార్డ్ చేసేవారని.. వాటిని సెట్స్‌లో కొందరు నటులు మొబైల్ ఫోన్లలో చూడటం తాను స్వయంగా చూశానని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటికే మాలీవుడ్‌ను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. జస్టిస్ కె.హేమ కమిటీ నివేదికను విడుదల చేసిన తర్వాత చాలా మంది బాధితులు బయటికి వచ్చి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా చెప్తున్నారు.
ఓ మలయాళ ఛానల్‌లో నటి రాధిక శరత్ కుమార్ చేసిన ఆరోపణ మాలీవుడ్‌లో ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు లేపాయి. హేమా కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యమైందని ఈ సందర్భంగా ప్రశ్నించిన రాధిక.. కేవలం మలయాళ పరిశ్రమలోనే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఒక మలయాళ సినిమా షూటింగ్ సెట్‌లో కొందరు నటులు.. క్యారవాన్లలో రహస్య కెమెరాలతో చిత్రీకరించిన నటీ వీడియోలను చూడటం నేను చూశాను. మహిళ కారవాన్లలో బట్టలు మార్చుకుంటున్న వీడియోలు కూడా అందులో ఉన్నాయి’’ అని రాధిక వెల్లడించారు. అయితే ఆ సినిమా పేరు, వీడియోలు చూసిన నటుల వివరాలను వెల్లడించడానికి రాధిక ఇష్టపడలేదు.
ఆ వీడియోలు తన కంటపడిన తర్వాత క్యారవాన్లలో మళ్లీ రహస్య కెమెరాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెట్‌లోనే ఇంఛార్జ్‌ని అప్పట్లో హెచ్చరించినట్లు రాధిక గుర్తు చేసుకుంది.
"ఆ వీడియోలను నటులు చూస్తుండటం చూసి నాకు చాలా కోపం వచ్చింది. నేను సురక్షితంగా ఉండాలని అనుకున్నాను. అందుకే నాకు క్యారవాన్ వద్దు అని చెప్పి హోటల్ గదికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేదాన్ని’’ అని రాధిక చెప్పుకొచ్చింది.
హేమా కమిటీ నివేదికపై ఇండస్ట్రీలోని హీరోలు మౌనం వహించడాన్ని రాధిక తప్పుబట్టారు. మహిళలలు తమను తాము రక్షించుకునే బాధ్యత వారి భుజాలపైనే వేసుకోవాలని రాధిక సూచించారు.
రాధిక ఆరోపణలపై ఆర్ ఎంపీ నేత కేకే రెమా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో క్రూరత్వాలు ఎవరి ఊహకు అందనివనిగా ఉన్నాయన్నారు. "ఇది ఎంత క్రూరత్వం... సినిమా ప్రపంచం అతి పెద్ద అండర్ వరల్డ్‌గా మారుతోంది. రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న ఆరోపణలను బట్టి అక్కడ ఏం జరుగుతుందో మేం అర్థం చేసుకుంటున్నాం అని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు.
‘‘సాధారణంగా సినీ పరిశ్రమలోని లేడీ ఆర్టిస్ట్‌లు క్యారవాన్ సురక్షితమని నమ్ముతారు. నటుల తరహాలో తమకు కూడా ఇలాంటి సౌకర్యాలు లభిస్తే షూటింగ్ లొకేషన్లలో సురక్షితంగా ఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ అది తప్పని రాధిక మాటలతో రుజువైంది’’ అని రెమా ఆవేదన వ్యక్తం చేశారు.
సీక్రెట్ కెమెరాల విషయం తెలిసినా ఇన్నాళ్లు రాధికా శరత్ కుమార్ మౌనం వహించడాన్ని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దీది దామోదరన్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి బయటపడితే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటికి వచ్చిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో విచారణకి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజుల వ్యవధిలో పలువురు నటులు, దర్శకులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.