Mohan Lal Resigns: మలయాళం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం.. మోహన్ లాల్ కూడా ఔట్
Mohan Lal Resigns: మలయాళం సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంక్షోభం సృష్టించాయి. హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మోహన్ లాల్ కూడా ఇప్పుడీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.
Mohan Lal Resigns: మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏఎంఎంఏ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశాడు. కార్యవర్గ సభ్యులంతా తమ ఉమ్మడి రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. జస్టిస్ కె.హేమ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆ కమిటీ నివేదిక, తదనంతర పరిణామాలు మలయాళ సినీ ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి.
రంగంలోకి కేరళ ప్రభుత్వం
మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక దాడుల ఆరోపణల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై విచారణ జరిపేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వేధింపులకు సంబంధించిన కొత్త కథనాలు ఆదివారం (ఆగస్ట్ 25) వెలుగులోకి వచ్చాయి. నటుడు, రాజకీయ నాయకుడు ముఖేష్ కు సంబంధించిన పాత పుస్తకం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫిల్మ్ అకాడమీ, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (ఎ.ఎం.ఎం.ఎ)లలో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగారు.
మోహన్ లాల్ పై విమర్శలు
గతంలో నటుడు షమ్మీ తిలకన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ తీవ్రమైన అంశంపై మోహన్ లాల్ నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టారు. మోహన్ లాల్ స్పందించే సామర్థ్యాన్ని కోల్పోయారని విమర్శించారు. ఎవరు తప్పు చేసినా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 'పవర్ గ్రూప్' అనే పదాన్ని హేమా కమిటీ ఉపయోగించిందని, వారి నివేదికలో దాని ఉనికికి ఆధారాలు ఉన్నాయని, ఈ సాక్ష్యాధారాల ఆధారంగా ఆ గ్రూపులో ఎవరెవరు ఉన్నారో గుర్తించగలమని షమ్మీ తిలకన్ అభిప్రాయపడ్డారు.
అటు అవార్డు గ్రహీత, స్క్రీన్ రైటర్, నటుడు అయిన రంజిత్ కొన్నేళ్ల క్రితం ఒక బెంగాలీ నటితో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓ యువ నటి తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మలయాళ మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్దిఖీ కూడా తన పదవికి రాజీనామా చేశాడు.
ఎమ్మెల్యే, నటుడు ముఖేష్‌పైనా ఆరోపణలు
ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తూ ఇండస్ట్రీలోని మరికొందరు నటీమణులు కూడా తమను వేధించిన వాళ్ల పేర్లు చెప్పకుండా తామూ బాధితులమే అని చెబుతుండటం గమనార్హం. అటు ఎమ్మెల్యే అయిన నటుడు ముఖేష్ కుమార్ గతంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వివరణ ఇచ్చాడు.
తాను అధికార సీపీఐ(ఎం) ఎమ్మెల్యేను కాబట్టి తనను ఒక వర్గం వ్యక్తులు టార్గెట్ చేశారని, ఆరోపణలు నిరాధారమైనవని రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ముఖేష్ స్పష్టం చేశాడు.