Director Hero Fight: సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తిండి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్-director hero fight on movie sets vidhu vinod chopra tore nana patekar kurta on film sets denied food ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Hero Fight: సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తిండి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్

Director Hero Fight: సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తిండి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్

Hari Prasad S HT Telugu
Aug 13, 2024 11:58 AM IST

Director Hero Fight: సెట్‌లోనే ఓ హీరో షర్ట్ చించేసి, అతనికి కనీసం తిండి కూడా పెట్టకుండా వేధించిన డైరెక్టర్ గురించి ఎప్పుడైనా విన్నారా? బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన హీరో, డైరెక్టర్ ఫైట్ గా పేరుగాంచిన ఈ ఘటన 35 ఏళ్ల కిందట జరిగింది.

సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తింటి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్
సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తింటి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్

Director Hero Fight: ఓ సినిమాకు డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయినా.. హీరో ముందు ఎవ్వరైనా కాస్త తగ్గాల్సిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఘటనలో మాత్రం మూవీ సెట్ లోనే ఓ డైరెక్టర్ హీరో కుర్తా చించేసి రచ్చ చేశాడు. ఆ హీరో సైలెంట్ గా అలా ఏడుస్తూనే షూటింగ్ చేయడం విశేషం. ఆ డైరెక్టర్ పేరు విధూ వినోద్ చోప్రా కాగా.. హీరో పేరు నానా పాటేకర్.

హీరో, డైరెక్టర్ ఫైట్

బాలీవుడ్ లో గతేడాది రిలీజై సంచలనం విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్ తెలుసు కదా. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధూ వినోద్ చోప్రానే 35 ఏళ్ల కిందట పరిందా అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో నేషనల్ అవార్డు విజేత అయిన విలక్షణ నటుడు నానా పాటేకర్ లీడ్ రోల్లో నటించాడు. అయితే అంతకుముందు చోప్రా మూవీ దారుణంగా విఫలమవడంతో ఈ పరిందా సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా మూవీ సెట్స్ లో ఉన్న వాళ్లందరూ ఎవరి లంచ్ వాళ్లు తమ ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని చెప్పారు. కానీ హీరో నానా పాటేకర్ మాత్రం తనకు ప్రొడక్షన్ వాళ్లే లంచ్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు. మీరు ఇంటి నుంచి తెచ్చుకోలేదా అని అతన్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన విధూ వినోద్ అడిగాడు. అది కాస్తా ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.

హీరో కుర్తా చించేసి..

ఆ సమయంలో హీరో నానా పాటేకర్ ఓ కుర్తా వేసుకొని ఉన్నాడు. నిజానికి అది తర్వాతి సీన్ కోసం ఏర్పాటు చేసిన కాస్ట్యూమ్. కోపంలో విధూ వినోద్ చోప్రా అతని కుర్తాను చించేశాడు. పైగా అతనికి కనీసం తిండి కూడా పెట్టలేదు. ఈలోపు నెక్ట్స్ సీన్ కు తాను రెడీగా ఉన్నట్లు సినిమాటోగ్రాఫర్ చెప్పడంతో నానా పాటేకర్ తన ఒంటిపై ఉన్న బనియన్ తోనే షూటింగ్ లోకి వెళ్లాడు.

ఈ ఘటనతో అతడు ఏడుస్తూనే ఉన్నాడు. అలాగే ఆ సీన్ కూడా చేయడం విశేషం. నిజానికి మూవీలోని ఆ సీన్లోనూ అతని పాత్ర కంటతడి పెట్టాల్సి ఉంటుంది. అయితే అక్కడ నానా పాటేకర్ నిజంగానే ఏడ్చాడన్న విషయం చాలా మందికి తెలియదు. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్, హీరో ఫైట్ పెద్ద చర్చనీయాంశమే అయింది.

1989లో ఈ పరిందా సినిమా వచ్చింది. అందులో నానా పాటేకర్ తోపాటు జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లాంటి వాళ్లు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ కావడం మరో విశేషం. అంతకుముందు తాను తీసిన ఖామోష్ సినిమా కోసం కనీసం డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరక్కపోవడంతో విధూ వినోద్ చోప్రా పరిందా రూపంలో ఓ కమర్షియల్ మూవీ తీయాలని భావించాడు.

Whats_app_banner