Mollywood #MeToo:మాలీవుడ్‌ని కుదిపేస్తున్న మీటూ వ్యవహారం, లిప్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒకప్పటి హీరోయిన్ తెరపైకి!
#MeToo ఉద్యమం మాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను వేధింపులకి గురైనట్లు చెప్పుకొచ్చింది.
మలయాళం సినిమా ఇండస్ట్రీని మీటూ వ్యవహారం గత కొన్నిరోజుల నుంచి కుదిపేస్తోంది. సినిమాల్లో మించిన ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌లు మాలీవుడ్‌లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తగా కొందరు మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కి రాజీనామా చేసి సైలెంట్‌గా జారుకుంటున్నారు.
హేమా కమిటీ ప్రకంపనలు
కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక బహిర్గతమైన తర్వాత చాలా మంది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అలానే బాధితులు కూడా చాలా మంది బయటికి వచ్చి తమకి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల్ని మీడియా ముందు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయ నాయకుడు, నటుడు ముకేష్‌పై రేప్ కేసు కూడా నమోదైంది. రానున్న రోజుల్లో మరికొంత మందిపై కూడా కేసులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కేరళలో మీటూ వ్యవహారంపై జోరుగా చర్చ నడుస్తుండటంతో మాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ఉష కూడా తెరపైకి వచ్చి 1992లో తనకి ఎదురైన చేదు అనుభవాన్ని మీడియా ముందు వెల్లడించింది. అప్పట్లో సీనియర్ హీరో మోహన్ లాల్‌కి కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు ఉష చెప్పుకొచ్చింది.
లిప్ట్ డోర్స్ క్లోజ్ కాగానే
‘‘గల్ఫ్‌లో షూటింగ్ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరాం. ఆ షూట్‌లో నాతో పాటు మోహన్ లాల్, రేవతి, మనీషా, సుకుమారి కూడా ఉన్నారు. అందరం ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుని అక్కడ రిలాక్స్ అవుతూ మాట్లాడుకుందాం అని మోహన్ లాల్ చెప్పారు. నా కంటే ముందే కొంత మంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిపోగా నేను ఆలస్యంగా బయల్దేరాను. ఈ క్రమంలో ఒక సీనియర్ నటుడు నాతో లిప్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడు. లిప్ట్ డోర్స్ క్లోజ్ అవగానే అతను నాతో ప్రవర్తించిన తీరుకి తొలుత షాక్ అయ్యాను. ఆ తర్వాత తేరుకుని ఒక చెంప దెబ్బ కొట్టాను’’ అని ఉష వెల్లడించింది.
మోహన్ లాల్‌కి ఫిర్యాదు
‘‘నా అదృష్టవశాత్తు నెక్ట్స్ ప్లోర్‌లోనే సుకుమారి ఆ లిప్ట్‌లోకి వచ్చింది. ఆమె ఏడుస్తున్న నన్ను, ఆ సీనియర్ నటుడి వైపు చూసి ఏదో తప్పు జరిగిందని గ్రహించి.. ఏం జరిగింది? అని నన్ను అడిగింది. దాంతో నేను మొత్తం చెప్పేశాను. వెంటనే మోహన్ లాల్‌కి ఫిర్యాదు చేయమని సుకుమారి చెప్పింది. ఇద్దరం కలిసి జరిగిన విషయాన్ని మోహన్ లాల్‌తో పాటు అక్కడ ఉన్న నటులకి చెప్పాం. అందరూ ఓదార్చి.. నువ్వు అతడ్ని కొట్టి మంచి పని చేశావు అని భరోసా ఇచ్చారు’’ అని ఉష వెల్లడించింది.
కానీ, ఆ ఘటన తర్వాత ఇండస్ట్రీ తనని దూరంగా పెట్టినట్లు ఉష తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటికే చేతిలో ఉన్న సినిమాలు చేజారడంతో పాటు కొత్త అవకాశాలు రాలేదని దాంతో అర్ధాంతరంగా కెరీర్‌ని ముగించాల్సి వచ్చిందని ఉష చెప్పుకొచ్చింది. మలయాళంలో కిరీటం, కొట్టాయం కుంజచన్ సినిమాల్లో ఉష నటించింది.