Gudlavalleru Engg College Case : లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన..! కేసులోని ముఖ్యమైన విషయాలివే-what ap police said on gudlavalleru girls washroom hidden camera case 10 updates read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gudlavalleru Engg College Case : లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన..! కేసులోని ముఖ్యమైన విషయాలివే

Gudlavalleru Engg College Case : లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన..! కేసులోని ముఖ్యమైన విషయాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 31, 2024 08:58 AM IST

గుడ్లవల్లేరులోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు పెట్టారన్న ఘటన సంచలనంగా మారింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది.

కాలేజీలో విద్యార్థుల ఆందోళన (HT photo)
కాలేజీలో విద్యార్థుల ఆందోళన (HT photo)

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్(ఎస్‌ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ) కాలేజీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన కొనసాగింది. లేడీస్ హాస్టల్ లో రహస్య కెమెరాలను కనిపెట్టేవరకూ తాము వసతిగృహంలోకి వెళ్లలేమంటూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు… కాలేజీ యాజమాన్యంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

రహస్య కెమెరాల ఘటనను కాలేజీ యాజమాన్యం  కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న తమను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయంపై శుక్రవారం గునుల శాఖ మంత్రి రవీంద్రకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై గురువారం రాత్రి నుంచి వందలాది మంది విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర వెళ్లారు. విద్యార్థులు తమ పరిస్థితిని మంత్రికి వివరించారు.

హిడెన్ కెమెరాల వ్యవహారంలో ప్రధానంగా ఇదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  అతని ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ముఖ్యమైన పాయింట్లు:

  1. విద్యార్థినుల వసతిగృహంలోని బాత్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు ఏర్పాటుచేసి వీడియోలు తీశారన్న ఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తతకు దారి తీసింది.
  2. ఈ ఘటనపై గురువారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీ యాజామాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
  3. హిడెన్ కెమెరాల ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు… జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
  4. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం కాలేజీకు వెళ్లారు. తమ సమస్యలను చెప్పిన విద్యార్థులు… బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తరగతులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… విచారణలో వాస్తవాలు బయటికి వస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
  5. విద్యార్థుల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు ఏవీ లేవని పోలీసులు చెబుతున్నారు. బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాలు కనుగొనబడలేదని… ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై బాలికలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది సమక్షంలో అనుమానితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారు.
  6. రహస్య కెమెరాల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గంగాధర్ రావు… వార్తా సంస్థ PTIకి తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో పాటు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్‌ను నియమించినట్లు వెల్లడించారు.
  7. ఆరోపిస్తున్నట్లు ఏవైనా వీడియోలు బయటికి వచ్చాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన  గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు.
  8. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ… విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు భయాపడాల్సిన అవసరం లేదన్నారు.
  9. హిడెన్ కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందిస్తూ… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని… సీఎం చంద్రబాబు ఇకనైనా మేల్కోవాలని హితవు పలికారు.
  10. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీకి యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ఇవాళ, రేపు హాస్టల్‌ విద్యార్థులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి సమ్మె చేసే యోచనలో విద్యార్థులు ఉన్నారు.