Sexual Abuse: తమిళ ఇండస్ట్రీలో దారుణంగా లైంగిక వేధింపులు.. నా కూతుళ్లను అందుకే దూరంగా ఉంచాను: నటి కామెంట్స్ వైరల్
Sexual Abuse: తమిళ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు మరింత దారుణంగా ఉంటాయని, అందుకే తన కూతుళ్లను ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు నటి కుట్టి పద్మిణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆమె కూడా ఈ వేధింపుల బారిన పడిన నటే కావడం గమనార్హం.
Sexual Abuse: సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై మరోసారి ఒక్కో నటి బయటకు వచ్చి తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మలయాళం ఇండస్ట్రీలో వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు నేపథ్యంలో తమిళ నటి కుట్టి పద్మిణి శుక్రవారం (ఆగస్ట్ 30) స్పందించింది. తమిళ ఇండస్ట్రీలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని, అందుకే తన కూతుళ్లను ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు ఆమె చెప్పడం గమనార్హం.
నా కూతుళ్లను దూరంగా ఉంచాను
కుట్టి పద్మిణి ఓ బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 10 ఏళ్ల వయసులో ఆమె కూడా ఈ లైంగిక వేధింపుల బారిన పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిస్థితిలో ఏ మార్పూ లేదని, లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. ఈ కమిటీలు, రిపోర్టులతో వచ్చేదేమీ లేదని అనడగం గమనార్హం.
"నిజానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే నా ముగ్గురు కూతుళ్లను తమిళ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచాను. నేను కూడా బాల నటిగా వేధింపులు ఎదుర్కొన్నాను. ఆ విషయం మా అమ్మకు చెబితే ఆమె ప్రొడ్యూసర్లను నిలదీసింది. వాళ్లు సింపుల్ గా నన్ను సినిమా నుంచి తప్పించారు" అని పద్మిణి వెల్లడించింది.
పరిస్థితి ఏమీ మారలేదు
ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఏమీ మారలేదని పద్మిణి అభిప్రాయపడింది. దీనికి సింగర్ చిన్మయి, నటి శ్రీ రెడ్డి ఉదంతాలే నిదర్శనమని చెప్పింది. మీటూ ఉద్యమం సమయంలో ఈ ఇద్దరూ తమపై జరిగిన వేధింపుల గురించి వెల్లడించారు. అయితే అప్పటి నుంచీ ఆ ఇద్దరూ అసలు కనిపించకుండా పోయారని పద్మిణి చెప్పింది.
ఈ వేధింపుల విషయంలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్న తమిళ నటుడు విశాల్ కామెంట్స్ పైనా పద్మిణి స్పందించింది. మీటూ సమయంలో ఇలాంటి కమిటీ ఏర్పాటు చేసినా ఒరిగిందేమీ లేదన్న విషయాన్ని గుర్తు చేసింది.
"అందులో ఇండస్ట్రీలోని శక్తివంతమైన మహిళలు రేవతి, రోహిణి, సుహాసినిలాంటి వాళ్లు ఉన్నారు. అయినా ఆ సమయంలో ఒక్క మీటింగ్ జరగలేదు. ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాలేదు" అని పద్మిణి తెలిపింది. ఇప్పుడు విశాల్ కామెంట్స్ కూడా కేవలం మాటలకే పరిమితం అని విమర్శించింది.
"నిజం చెప్పాలంటే ఘటన జరిగిన ఎన్నో ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉండవు. దీంతో సులువుగా వాటిని కొట్టి పారేయవచ్చు. నా విషయమే తీసుకోండి. పిల్లలపై లైంగిక వేధింపులు చాలా తీవ్రమైన అంశం. కానీ నిందితులు మాత్రం ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకున్నారు. ఎప్పుడూ అదే జరుగుతుంది" అని పద్మిణి అభిప్రాయపడింది.