Skanda Youtube Record: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న రామ్, బోయపాటి మూవీ.. అరుదైన రికార్డు
Skanda Youtube Record: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద మూవీ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడ హిందీ వెర్షన్ లో కావడం విశేషం.
Skanda Youtube Record: రామ్ పోతినేనిని మరోసారి ఓ మాస్ అవతార్ లో చూపించిన మూవీ స్కంద. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ఇప్పుడీ సినిమా హిందీ వెర్షన్ మాత్రం యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెల రోజుల్లోనే ఓ అరుదైన మైలురాయిని ఈ సినిమా అందుకోవడం విశేషం.
స్కంద హిందీ వెర్షన్ రికార్డు
రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద మూవీ గతేడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. అయితే తాజాగా నెల రోజుల కిందట ఈ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. హిందీ వాళ్లకు మాత్రం తెగ నచ్చేసింది. అందుకే నెల రోజుల్లోనే యూట్యూబ్ లో ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి.
అంతేకాదు 1.1 మిలియన్ లైక్స్ కూడా రావడం విశేషం. ఈ మాస్ యాక్షన్ మూవీ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు యూట్యూబ్ లో నమోదైన ఈ అరుదైన రికార్డే చెబుతోంది. స్కంద పేరుతోనే హిందీలోనూ ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా తీసుకెళ్లారు. జూన్ 17న వామ్‌ఇండియా మూవీస్ ఈ స్కంద హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.
అయితే అనూహ్యంగా ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొన్నేళ్లుగా సౌత్ లో రూపొందిన మాస్ యాక్షన్ సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న విషయం తెలుసు కదా. అలాగే మన వాళ్లకు నచ్చని ఈ స్కందను కూడా అక్కున చేర్చుకున్నారు.
స్కంద స్టోరీ ఏంటంటే?
తండ్రి స్నేహితుడికి ముఖ్యమంత్రులు చేసిన అన్యాయంపై పగను తీర్చుకునే ఓ యువకుడి కథ ఇది. రెండు ముక్కల్లో ఆయిపోయే కథను రెండు గంటల నలభై నిమిషాల పాటు స్క్రీన్‌పై చెప్పడానికి బోయపాటి స్క్రీన్‌పై భీభత్సం సృష్టించాడు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, పాలిటిక్స్ ఇలా అన్నిఅస్త్రాలు వాడాడు. చివరకు క్లైమాక్స్‌లో డ్యూయల్ రోల్ అంటూ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. మాస్ ఆడియెన్స్‌కు కంప్లీట్ ఫుల్ మీల్స్ అందించేందుకు చాలా కష్టపడ్డాడు.
కథల కంటే యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్‌ను నమ్ముకొనే కెరీర్ ఆరంభం నుంచి డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు చేస్తున్నాడు. అతడి సినిమా అంటే తెరనిండా రక్తపాతం, హింస కామన్‌గా కనిపిస్తాయి. స్కంద కూడా అలాంటి రొటీన్ టెంప్లేట్ మూవీనే. సింపుల్ రివేంజ్ డ్రామాతో బోయపాటి శ్రీను స్కంద కథను రాసుకున్నారు. తనదైన శైలి మాస్ హంగులు, హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో లాజిక్స్‌ను పూర్తిగా పక్కనపెట్టి మ్యాజిక్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు.
ఇస్మార్ట్ శంకర్ మినహా కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ , లవర్ బాయ్ టైప్ రోల్స్ చేశాడు రామ్. అతడిలోని మాస్ కోణాన్ని ఈ సినిమాలో పతాక స్థాయిలో బోయపాటి ఆవిష్కరించారు. తెలంగాణ, రాయలసీమ యాసలో అతడు చెప్పిన డైలాగ్స్, క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి.