Oke Oka Jeevitham Movie Review: ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ - టైమ్ ట్రావెల్ కథతో శర్వానంద్ మెప్పించాడా
Oke Oka Jeevitham Movie Review: శర్వానంద్, రీతూవర్మ జంటగా నటించిన చిత్ర ఒకే ఒక జీవితం. శ్రీకార్తిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే....
Oke Oka Jeevitham Movie Review: హీరోగా ఒకే తరహా ఇమేజ్‌కు పరిమితమైపోకుండా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు శర్వానంద్(sharwanand). ఆ బాటలోనే ఆయన చేసిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. అరుదైన టైమ్ ట్రావెట్ కథాంశంతో దర్శకుడు శ్రీకార్తిక్ ఈ సినిమాను తెరకెక్కించారు. రీతూవర్మ(Ritu Varma) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెన్నెలకిషోర్(Vennela kishore), ప్రియదర్శి (Priyadarshi) కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళంలో నేడు థియేటర్ల ద్వారా ఒకే ఒక జీవితం సినిమా విడుదలైంది. టైమ్ ట్రావెట్ కథతో శర్వానంద్ విజయాల బాట పట్టాడా? ఒకే ఒక జీవితం అతడికి ఎలాంటి రిజల్ట్ అందించిందో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
కాలంలో వెనక్కి వెళితే...
ఆది (శర్వానంద్),శ్రీను(వెన్నెల కిషోర్), చైతూ(ప్రియదర్శి) చిన్ననాటి స్నేహితులు. ఆదికి సంగీతం అంటే ఇష్టం. తల్లి( అమల) కోరిక మేరకు సింగర్‌గా పేరుతెచ్చుకోవాలని కోరుకుంటాడు. కారు ప్రమాదంలో తల్లిచనిపోవడంతో కృంగిపోతాడు. అనుక్షణం ఆమెను తల్చుకుంటూ బాధపడుతుంటాడు. శ్రీను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు. మామ కూతురును పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. శీనుకు చదువులేకపోవడంతో అతడి కల తీరదు. చైతూ అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని ఎదురుచూస్తుంటాడు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒక వంక పెడుతుంటాడు. చిన్నతనంలో తన స్కూల్‌మేట్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ సఫలం కాదు.
రంగి కుట్టి పాల్ (నాజర్) అనే సైంటిస్ట్ కనిపెట్టిన టైమ్ మిషన్ ద్వారా అమ్మను తిరిగి బ్రతికించుకునే అవకాశం ఉందని తెలుసుకున్న ఆది ఆ టైమ్ మిషన్‌లో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాలని అనుకుంటాడు. అతడితో పాటు శీను, చైతూ కూడా కాలంలో వెనక్కి వెళ్లి తమ జీవితాల్ని మార్చుకోవాలని భావిస్తారు. 2019 నుంచి 1998 టైమ్‌లోకి వెళ్లిన వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఆది తన అమ్మను కాపాడుకోగలిగాడా? టైమ్ మిషన్ మిస్ కావడంతో 1998లోని చిక్కుకుపోయిన వారు తిరిగి నేటి కాలానికి ఎలా వచ్చారు? విధిని మార్చాలనే వారి సంకల్పం సాధ్యమైందా? వైష్ణవి (రీతూవర్మ) ప్రేమను ఆది అర్థం చేసుకున్నాడా? శీను, చైతూ తమ జీవితాల్ని మార్చుకోగలిగారా? లేదా? అన్నదే ఒకే ఒక జీవితం సినిమా కథాంశం.
మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది...
టైమ్ ట్రావెల్ సినిమాల్లో లాజిక్స్ కంటే మ్యాజిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ మ్యాజిక్ వర్కవుట్ చేస్తూ కథ, కథనాలతో ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసినప్పుడే ఈ టైమ్ ట్రావెల్ సినిమాలు విజయాల్ని సాధించాయి. ఆ ప్రయత్నంలో ఒకే ఒక జీవితం చాలా వరకు సక్సెస్ అయ్యింది.
మదర్ సెంటిమెంట్...
టైమ్ ట్రావెల్ పాయింట్‌కు మదర్ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు శ్రీకార్తిక్ ఈ కథను రాసుకున్నారు. సైన్స్ ద్వారా విధి రాతను మార్చాలని ప్రయత్నించే ఓ ముగ్గురు యువకుల జీవితాల్ని ఎమోషన్స్, కామెడీ కలబోసి సినిమాలో ఆవిష్కరించారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మార్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని సినిమాలో చూపించారు. శర్వానంద్, అమల క్యారెక్టర్స్ ద్వారా ఎమోషన్స్ పండిస్తూనే మరోవైపు వెన్నెలకిషోర్, ప్రియదర్శి పాత్రల నుండి వినోదాన్ని రాబట్టుకున్నారు.
ముగ్గురు స్నేహితుల కథ…
ముగ్గురు స్నేహితుల కలలు, రియాలిటీలో వారి జీవితాలతో సినిమా వినోదాత్మక పంథాలో మొదలవుతుంది. ఆరంభంలో బ్రోకర్ దందా పేరుతో వెన్నెల కిషోర్ చేసే హాడావిడి, ప్రియదర్శి పెళ్లి చూపుల ప్రహాసనం నవ్విస్తాయి. టైమ్ మిషన్ లో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిన వారికి అక్కడ ఎదురయ్యే అనుభవాల నుంచి కావాల్సినంత కామెడీ జనరేట్ అయ్యేలా సీన్స్ రాసుకున్నారు దర్శకుడు. చిన్నతనంలో తాము చదువుతున్న స్కూల్‌కు వెళ్లడం, తమ బాల్యం కళ్ల ముందు కదలాడుతుండటం లాంటి సీన్స్ బాగున్నాయి.
టైమ్ మిషన్ మిస్ అయిపోవడం అనే ట్విస్ట్ ఇస్తూ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు దర్శకుడు. ఆ టైమ్ పీరియడ్ నుండి నేటి కాలానికి రావడానికి ఆది, శీను, చైతూ పడే కష్టాలను కామెడీ వేలో చూపించారు. మరోవైపు అమ్మను బతికించుకోవడానికి ఆది పడే తపన, ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తూ సెంటిమెంట్‌ను రాబట్టుకున్నారు. లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూసిన వారిలో ఎలా మార్పు వచ్చిందన్నది క్లైమాక్స్‌లో చూపించారు.
ఫోకస్ పెడితే బాగుండేది…
ముందుగానే చెప్పినట్లుగా సినిమాలో ఎక్కడ లాజిక్స్ కనిపించవు. చాలా చోట్ల కథను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమకథపై దర్శకుడు పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
శర్వానంద్, అమల క్యారెక్టర్స్ బలం…
ఒకే ఒక జీవితం సినిమాలో అమ్మ ప్రేమ కోసం తపించే ఆది అనే యువకుడిగా భావోద్వేగభరితంగా సాగే పాత్రలో శర్వానంద్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి అభినయాన్ని కనబరిచాడు. అమలతో అతడి కాంబినేషన్ లో వచ్చే ప్రతి సీన్ మనసుల్ని కదిలిస్తుంది. ప్రియదర్శి, వెన్నెలకిషోర్ కామెడీ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. చాలా చోట్ల వెన్నెలకిషోర్ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. 20 ఏళ్లు వెనక్కి వెళ్లి తమ జీవితాల్ని సరిదిద్దుకోవడానికి వారు పడే తిప్పలు హిలేరియస్ గా ఉంటాయి. శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. తనయుడే సర్వస్వంగా బతికే తల్లిగా తన యాక్టింగ్ తో ఈ పాత్రకు ప్రాణంపోసింది. రీతూవర్మ క్యారెక్టర్ పెద్దగా ప్రాధాన్యం లేదు. సైంటిస్ట్ పాత్రలో నాజర్ కనిపించాడు.
క్లిష్టతరమైన పాయింట్...
దర్శకుడిగా శ్రీకార్తిక్ మెప్పించాడు. క్లిష్టమైన పాయింట్‌ను ఎలాంటి తడబాటు లేకుండా సరదాగా తెరపై ఆవిష్‌కరించారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చక్కగా కుదిరాయి.
ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది...
మాస్, కమర్షియల్ హంగులతో కూడిన రెగ్యులర్ ఫార్ములా సినిమాలతో పోలిస్తే ఒకే ఒక జీవితం కొత్త అనుభూతిని మిగుల్చుతుంది. టైమ్ ట్రావెల్ సైంటిఫిక్ సినిమాల్ని ఇష్టపడే ప్రతిఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుంది.