Kamal Haasan: ఆ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: కమల్ హాసన్-shah rukh khan worked in hey ram for free kamal haasan revealed at indian 2 trailer launch event kollywood bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan: ఆ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: కమల్ హాసన్

Kamal Haasan: ఆ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: కమల్ హాసన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 26, 2024 03:51 PM IST

Kamal Haasan - Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్‍కు తాను కృతజ్ఞుడిగా ఉంటానని కమల్ హాసన్ చెప్పారు. హే రామ్ చిత్రంలో షారుఖ్ ఉచితంగా నటించారని వెల్లడించారు. ఇండియన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలను కమల్ వెల్లడించారు.

Kamal Haasan: ఆ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: కమల్ హాసన్
Kamal Haasan: ఆ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. 1996లో వచ్చిన ఇండియన్‍కు సీక్వెల్‍గా ఇప్పుడు ఈ మూవీ వస్తోంది. జూలై 12వ తేదీన ఇండియన్ 2 (భారతీయుడు 2) రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇందుకోసం ఈవెంట్ జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో షారూఖ్ ఖాన్ గురించి కమల్ హాసన్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు.

షారూఖ్ ఫ్రీగా నటించారు

‘హే రామ్’ (2000) సినిమాలో షారుఖ్ తనతో ఉచితంగా నటించారని కమల్ హాసన్ తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. షారుఖ్ మంచి నటుడు అని అన్నారు. తమిళం, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందిన హేరామ్ మూవీలో సాకేత్ రామ్ పాత్రను కమల్ హాసన్ చేయగా.. అతడి స్నేహితుడు అంజాద్ అలీఖాన్ క్యారెక్టర్ చేశారు షారూఖ్. ఆ చిత్రానికి కమల్ హాసనే దర్శకత్వం వహించారు.

ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు స్టార్, సూపర్ స్టార్ లాంటి టైటిళ్లు అసలు ముఖ్యం కాదని తెలిపారు. ఈ సందర్భంగానే షారుఖ్ గురించి ప్రస్తావించారు. “మేం కలిసి పని చేస్తున్నప్పుడు.. మేమంతా సాధారణమైన వ్యక్తులమే. నేను సూపర్ స్టార్‌గా భావించను. సూపర్ డైరెక్టర్‌గా అనుకోను. మేం ఫ్రెండ్స్. షారుఖ్ ఖాన్ ఆ సినిమాను ఉచితంగా చేశారు. తాను సూపర్ స్టార్ అనుకొని ఉంటే ఆయన అలా చేసేవారు కాదు. సినీ అభిమానులే అలా చేయగలరు. షారుఖ్ మంచి నటుడు, మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆయనకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా. మాకు ఆ తర్వాత మీరే టైటిల్స్ ఇస్తారు. మేం మోహమాటంగానే అంగీకరిస్తాం” అని కమల్ హాసన్ చెప్పారు.

దిలీప్ కుమార్‌తో నటించాలనుకున్నా కానీ..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి తేవర్ మంగన్ హిందీ రీమేక్ చిత్రంలో నటించాలని తాను అనుకున్నానని కమల్ హాసన్ చెప్పారు. భరతన్ దర్శకత్వం వహించిన హిందీ రీమేక్ చిత్రంలో దిలీప్‍తో తెర పంచుకోవాలని ఆశించినట్టు చెప్పారు. కానీ అప్పటికే సినిమాల నుంచి దిలీప్ కుమార్ రిటైర్ అవడంతో సాధ్యం కాలేదని తెలిపారు.

ఇండియన్ 2 గురించి..

1996లో వచ్చిన సూపర్ హిట్ అయిన ఇండియన్ చిత్రానికి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్‍గా ఇండియన్ 2 వస్తోంది. తెలుగులో భారతీయుడు 2, హిందీలో హిందుస్థానీ 2 పేర్లతో రిలీజ్ కానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవినీతిపరుల ఆటకట్టించే సేనాపతి పాత్రలో మరోసారి కమల్ వచ్చేస్తున్నారు. ట్రైలర్లో విభిన్న గెటప్‍లో కమల్ మళ్లీ తన మార్క్ చూపించారు.

ఇండియన్ 2 చిత్రంలో కమల్‍తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్‍జే సూర్య, బాబీ సింహ, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, మనోబాల, ఢిల్లీ గణేశ్ కీలకపాత్రలు చేశారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జూలై 12న ఇండియన్ 2 థియేటర్లలో రిలీజ్ కానుంది.

WhatsApp channel