Shaakuntalam Release Postponed: సమంత 'శాకుంతలం' రిలీజ్ వాయిదా.. ఇదీ కారణం!
Shaakuntalam Release Postponed: సమంత 'శాకుంతలం' మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం (సెప్టెంబర్ 290 అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్‌ను ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే.
Shaakuntalam Release Postponed: టాలీవుడ్ బ్యూటీ సమంత.. శకుంతలగా కనిపిస్తున్న పాన్ ఇండియా మూవీ శాకుంతలంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ఈ మధ్యే ఓ మోషన్ పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు గురువారం (సెప్టెంబర్ 29) మేకర్స్ ప్రకటించారు. కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ సినిమాను 3డీలో అందించాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆ పనులు చేయడానికి మరికాస్త సమయం పడుతుందని, అందుకే రిలీజ్‌ను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
"శాకుంతలంతో ఓ గొప్ప అనుభూతిని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి 3డీ అనేది ఓ గొప్ప మార్గం అవుతుందని టీమ్ భావించింది. దీనికోసం మేము మరికొంత సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించాం. దీంతో ముందుకు ప్రకటించిన రిలీజ్ డేట్‌కు సినిమాను తీసుకురావడం సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. దీనికి కూడా మీ నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం" అని మేకర్స్ ట్విటర్‌లో రాశారు.
ప్రస్తుతం శాకుంతలం మూవీని 3డీ వెర్షన్‌లోకి మార్చే పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతలగా సమంత, దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఇక ఇదే మూవీలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కూడా నటించడం విశేషం.
గుణశేఖర్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అతని కూతురు నీలిమ గుణనే ఈ మూవీని నిర్మించింది. ఇక దిల్ రాజు ఈ శాకుంతలం మూవీని సమర్పిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లో రిలీజ్ కానుంది.