Sapne Vs Everyone Web Series Review: టీవీఎఫ్ అందించిన మరో అద్భుతమైన వెబ్ సిరీస్.. సప్నే vs ఎవ్రీవన్ రివ్యూ-sapne vs everyone web series review another must watch tvf show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sapne Vs Everyone Web Series Review: టీవీఎఫ్ అందించిన మరో అద్భుతమైన వెబ్ సిరీస్.. సప్నే Vs ఎవ్రీవన్ రివ్యూ

Sapne Vs Everyone Web Series Review: టీవీఎఫ్ అందించిన మరో అద్భుతమైన వెబ్ సిరీస్.. సప్నే vs ఎవ్రీవన్ రివ్యూ

Hari Prasad S HT Telugu
Jan 08, 2024 09:20 AM IST

Sapne Vs Everyone Web Series Review: ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అందించిన మరో అద్భుతమైన వెబ్ సిరీస్ సప్నే vs ఎవ్రీవన్ (Sapne Vs Everyone). జీవితంలో ఏదో సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరూ తమను తాము తెరపై చూసుకుంటున్నట్లుగా సాగే ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్ రివ్యూ
సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్ రివ్యూ (The Viral Fever 'X' Account)

Sapne Vs Everyone Web Series Review: సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ (Sapne Vs Everyone).. టైటిల్లో ఉన్నట్లే మన కలలు, వాటిని నెరవేర్చుకునే క్రమంలో అడ్డుపడే వ్యక్తులు, పరిస్థితులు, సమాజం.. వీటి చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అందించిన మరో జెమ్ అని చెప్పొచ్చు.

మిలీనియల్స్, జెనరేషన్ జెడ్‌ను అట్రాక్ట్ చేసే షోలు ఎన్నో అందిస్తున్న టీవీఎఫ్.. తాజాగా ఈ ఇన్‌స్పిరేషనల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

వెబ్ సిరీస్: సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ (Sapne Vs Everyone)

ఓటీటీ: టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్

డైరెక్టర్: అంబ్రిష్ వర్మ

నటీనటులు: అంబ్రిష్ వర్మ, పరమ్‌వీర్ చీమా, నవీన్ కస్తూరియా

ఎపిసోడ్లు: ఐదు (ఐదో ఎపిసోడ్ ఈ శుక్రవారం (జనవరి 12) రానుంది)

సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ స్టోరీ ఏంటి?

అసలు కలలు అంటే ఏంటి? ఓ మనిషి జీవితంలో సక్సెస్ సాధించడమా? తాను అనుకున్నది నెరవేర్చుకోవడమా? తనకు ఇష్టమైన పని చేయడమా? తమ లక్ష్యాలను సాధించడమా? నిజానికి దీనికి కచ్చితమైన డెఫెనెషన్ అంటూ ఏదీ లేదు. మనిషి బట్టి దాని అర్థం మారుతుంది. అయితే ప్రతి మనిషి ఏవో కలలు కంటాడు.

తన జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాడు. కొందరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ కలలు సాకారం చేసుకుంటారు. మరికొందరు తమకు ఎదురయ్యే అడ్డంకులు, బాధ్యతలు, భయాల వల్ల ఆ కలలను కలలుగానే వదిలేస్తారు. సరిగ్గా ఈ కలల చుట్టూ తిరుగుతూ సాగేదే ఈ సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్. తాను ఈ సిరీస్ లో ఏం చెప్పాలనుకుంటున్నానో టైటిల్ ద్వారానే స్పష్టం చేశాడు రైటర్, డైరెక్టర్ అంబ్రిష్ వర్మ.

ఓ ఇద్దరు యువకులు.. జిమ్మీ (అంబ్రిష్ వర్మ), ప్రశాంత్ (పరమ్‌వీర్ చీమా). ఇద్దరిదీ ఒక్కో కల. ఆ కలను నెరవేర్చుకోవడంలో మాత్రం ఇద్దరి పంథాలు పూర్తిగా వేరు. ఒకరు జీవితంలో ధైర్యంగా, తెగింపుతో ముందడుగు వేసే వ్యక్తి కాగా.. మరొకరు కుటుంబ బాధ్యతలు, భయాలతో తన కలను నెరవేర్చుకోవడానికి అష్టకష్టాలు పడే వ్యక్తి. ఈ ఇద్దరూ తమ లక్ష్యాలను అందుకుంటారా లేదా అన్నదే అసలు కథ.

సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ ఎలా ఉందంటే?

సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్
సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్

తొలి సీజన్ లో ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. ప్రతి ఎపిసోడ్ లోనూ రక్తి కట్టించేలా సాగిపోయింది. ఈ సిరీస్ కు రచయిత, దర్శకుడు అయిన అంబ్రిష్ వర్మనే స్వయంగా నటించాడు. అతడు ఈ స్టోరీ చెప్పే విధానం, రాసిన ప్రతి డైలాగ్ మనల్ని అంబ్రిష్ కు ఓ పెద్ద అభిమానిగా మార్చేస్తాయనడంలో సందేహం లేదు.

ఓ మనిషి తన కలను నెరవేర్చుకోవాలంటే తన చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం, పరిస్థితులతో ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిందే అన్న సందేశాన్ని మనసుకు హత్తకునేలా అంబ్రిష్ తెరకెక్కించాడు. ఈ సిరీస్ లోని జిమ్మీ, ప్రశాంత్ వ్యక్తిత్వాలు మనలోని చాలా మందిని పోలి ఉంటాయి. ఆ పాత్రలను తెరపై చూస్తున్నంతసేపూ మనల్ని మనం చూసుకుంటున్నట్లుగానే అనిపిస్తుంది.

ఇప్పటికే డ్యూడ్, ఎన్‌సీఆర్ డేస్ లాంటి వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేసిన అంబ్రిష్ వర్మ.. ఈ సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ ద్వారా ఓ రైటర్ గా, ఓ డైరెక్టర్ గా, ఓ యాక్టర్ గా తనలోని అత్యుత్తమ ప్రతిభను చూపించాడు. అంబ్రిష్ ఒక్కడే కాదు.. ఈ సిరీస్ లో మరో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రశాంత్ పాత్ర పోషించిన పరమ్‌వీర్ చీమాను కూడా మెచ్చుకోవాల్సిందే. ప్రపంచంలోనే గొప్ప నటుడిగా ఎదగాలనుకునే ఓ అమాయకుడి పాత్రలో జీవించేశాడు.

మస్ట్ వాచ్ వెబ్ సిరీస్

ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సప్నే వెర్సెస్ ఎవ్రీవన్ టీవీఎఫ్ అందించిన ఓ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్లో ఫ్రీగా ఈ సిరీస్ చూడొచ్చు. ఒక్కో ఎపిసోడ్ గా ప్రతి వారం రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 8న తొలి ఎపిసోడ్ రాగా.. డిసెంబర్ 29 వరకూ నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఐదో ఎపిసోడ్ ఈ శుక్రవారం (జనవరి 12) రాబోతోంది. ఇదే తొలి సీజన్ చివరి ఎపిసోడ్.

ఇప్పటి వరకూ ఈ సిరీస్ మీరు చూసి ఉండకపోతే.. ఈ శుక్రవారం లోపు తొలి నాలుగు ఎపిసోడ్లు బించ్ వాచ్ చేసేసి.. ఎంతో ఆసక్తి రేపుతున్న ఐదో ఎపిసోడ్ చూడటానికి సిద్ధమైపోండి. చివరిగా ఈ సిరీస్ కు ఐఎండీబీలో 9.7 రేటింగ్ ఉంది. దీనిని బట్టే ప్రేక్షకులకు ఇది ఎంతలా నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు.

Whats_app_banner