Sai Dharam Tej: మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఎవరి పేరు యాడ్ చేశాడో తెలుసా?
Sai Dharam Tej Changed His Name: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును మళ్లీ మార్చుకున్నాడు. ఇది వరకు తన పేరులోని ధరమ్ అని తీసేసి ఒట్టి సాయి తేజ్ అని పెట్టుకున్న ఈ సుప్రీమ్ హీరో మరోసారి తన పేరు మార్చుకున్నట్లు తెలిపాడు. మరి కొత్తగా తను ఎవరు పేరు యాడ్ చేశారనే వివరాల్లోకి వెళితే..
Sai Dharam Tej Name Changed: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రేయ్ మూవీతో మొదటగా నటించిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష మూవీతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం బాబాయ్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన బ్రో సినిమా యావరేజ్‌గా నిలిచింది.
అయితే, తాజాగా మహిళా దినోత్సవం (International Womens Day 2024) సందర్భంగా మార్చి 8న షార్ట్ ఫిల్మ్ సత్య (Satya) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేదికగా తన పేరు మార్చుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. సాయి తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) అని మార్చుకున్నట్లు తెలిపాడు. తన తల్లి పేరు అయిన 'దుర్గ'ను తన పేరులో యాడ్ చేసుకున్నట్లు వివరించాడు.
ఇలా తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లు ఉంటుందనే భావనతో ఇలా పేరును యాడ్ చేసుకున్నట్లు సాయి తేజ్ తెలిపాడు. "నా పేరులో మా నాన్న గారి పేరు ఉంది. అలాగే మా అమ్మ గారి పేరు కూడా ఉండాలని ఇలా సాయి దుర్గ తేజ్ అని పెట్టుకున్నాను" అని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. కాగా సాయి తేజ్ వాళ్ల అమ్మ పేరు విజయ దుర్గ అని తెలిసిందే. అయితే సాయి తేజ్ ఇలా పేరు మార్చుకోవడం ఇది రెండోసారి.
గతంలో తన స్క్రీన్ నేమ్‌ను ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కానీ, ఇప్పటికీ చాలా మంది ఈ సుప్రీమ్ హీరోను సాయి ధరమ్ తేజ్ అనే పిలుస్తుంటారు. మరి ఇప్పుడైనా సాయి దుర్గ తేజ్ అని ఎంత మంది పిలుస్తారో చూడాలి. ఇదిలా ఉంటే సత్య ప్రెస్ మీట్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. గాంజా శంకర్ మూవీ ఆగిపోవడం నుంచి మెగాస్టార్ చిరంజీవితో సినిమా వరకు అనేక విషయాలు పంచుకున్నాడు సాయి దుర్గ తేజ్.
గాంజా శంకర్ (Gaanja Shankar) సినిమా ఆగిపోయిందా అని అడిగిన ప్రశ్నకు "ఓ వెబ్ సైట్‌లో గాంజా శంకర్ సినిమా నిలిచిపోయిందనే ఆర్టికల్ చదివాను. ఆ తర్వాత అప్డేట్ గురించి నాకు తెలియదు. ఆ సైట్ రాసిన వార్త వల్లే సినిమా ఆగిపోయిందని నాకు తెలిసింది" అని వెటకారంగా సమాధానం ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. అలాగే ప్రొడక్షన్ సంస్థను నెలకొల్పానే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టినట్లు చెప్పాడు.
రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. "నాగబాబు, పవన్ కల్యాణ్ మావయ్యలతో కలిసి నటించాను. తర్వాత చిరంజీవి మావయ్యతో తెరను పంచుకోవాలనేది లక్ష్యం. ఆ కల పూర్తయ్యకా మా ఫ్యామిలీలోని ఇతర హీరోలతో కలిసి నటిస్తా" అని సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చాడు. కాగా సాయి తేజ్, కలర్స్ స్వాతి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య.
నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది సత్య మూవీ. ఇటీవల ఫ్రాన్స్‌లో నిర్వహించిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ వేడుకలో కూడా సత్యను ప్రదర్శించారు. అందులో ఎనిమిది అవార్డ్స్ అందుకుంది సత్య మూవీ. వీటితోపాటు ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 2 పురస్కారాలు చేజిక్కించుకుంది ఈ సినిమా.