Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!
Ranveer Singh - Prasanth Varma Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది.
Ranveer Singh - Prasanth Varma: హనుమాన్ సినిమాతో టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో రిలీజైన హనుమాన్ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో ఆ చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారంటూ ప్రశాంత్‍పై ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్‍తో సినిమా చేసే అవకాశాన్ని ప్రశాంత్ వర్మ దక్కించుకున్నారని తెలుస్తోంది.
పీవీసీయూలో భాగమే!
రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍లో మూవీ దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగానే ఉండనుందనే సమాచారం బయటికి వచ్చింది. పీవీసీయూలో తొలి మూవీగా హనుమాన్ వచ్చింది. దీనికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు.
జై హనుమాన్ కంటే ముందు!
అయితే, రణ్‍వీర్‌తో ప్రశాంత్ చేసే మూవీ కూడా పీవీసీయూలోనే భాగంగా ఉండనుందట. అందులోనూ జై హనుమాన్ కంటే ముందే ఈ మూవీ రూపొందుతుందని తెలుస్తోంది. పీవీసీయూలో తదుపరి వచ్చే చిత్రం రణ్‍వీర్ సింగ్‍తో చేసేదే అని టాక్.
దీంతో ప్రశాంత్ వర్మతో చేసే ఈ మూవీలో రణ్‍వీర్ సింగ్.. సూపర్ హీరోగా కనిపిస్తాడనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ విపరీతంగా ఉండనుంది. మరి, ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలువుతుందని తెలుస్తోంది.
రణ్‍వీర్ సింగ్‍తో మూవీ గురించి ప్రశాంత్ వర్మ టీమ్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. “అవును, తన సినిమాటిక్ యూనివర్స్‌లో సినిమా చేసేందుకు రణ్‍వీర్ సింగ్‍ను ప్రశాంత్ వర్మ సంప్రదించారు. హనుమాన్ తర్వాత ఇదే తర్వాతి ప్రాజెక్టుగా ఉంటుంది. రణ్‍వీర్ సింగ్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. తుది నిర్ణయాలు తీసుకున్నాక త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది” అని ప్రశాంత్ వర్మ టీమ్ వర్గాల నుంచి హెచ్‍టీకి సమాచారం అందింది.
జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్టు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈనెలలోనే శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ చిత్రానికి సంబంధించి మూవీ టీమ్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఐమాక్స్, 3డీ ఫాట్మాట్లలో కూడా ఈ చిత్రం వస్తుందని వెల్లడించింది. మరి, ప్రశాంత్ వర్మ నుంచి ముందుగా రణ్‍వీర్‌తో మూవీ వస్తుందా.. జై హనుమాన్ రానుందా అనే విషయంలో త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హనుమాన్ గురించి..
హనుంతుడు స్ఫూర్తిగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీకి ఆరంభం నుంచి అద్భుతమైన టాక్ వచ్చింది. దీంతో తెలుగు, హిందీతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. సుమారు రూ.40 కోట్లతో రూపొందిన ఈ మూవీ ఏకంగా రూ.330కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.