Animal Pre Teaser: నరుకుడే నరుకుడు! యానిమల్ ప్రీ టీజర్ వచ్చేసింది: చూశారా?
Animal Pre Teaser: యానిమల్ సినిమా ప్రీ టీజర్ వచ్చేసింది. టీజర్ మొత్తం దాదాపు వైలెన్స్ ఉంది.
Animal Pre Teaser: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నయా మూవీ ‘యానిమల్’ ప్రీ-టీజర్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీ టీజర్ నేడు (జూన్ 11) విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉండనుందో ఈ టీజర్‌తోనే దర్శకుడు సందీప్ చెప్పేశాడు. అసలు సిసలైన వైలెన్స్ అంటే ఏంటో యానిమల్ చిత్రంతో చూపిస్తానని గతంలో ఓసారి చెప్పిన సందీప్.. అదే చేసినట్టున్నాడు. యానిమల్ మూవీ ఎంత వైలెంట్‍గా ఉంటుందో ఈ ప్రీ టీజర్‌తో హింట్ ఇచ్చాడు. వివరాలివే..
యానిమల్ మూవీ ప్రీ టీజర్ మొత్తం 50 సెకన్ల నిడివితో ఉంది. ముందుగా మాస్కులు వేసుకున్న కొందరు కనిపిస్తారు. ఆ తర్వాత ఓ పంజాబీ సాంగ్‍ను కొందరు పాడుతుంటారు. ఆ బ్యాక్‍గ్రౌండ్‍లో అప్పుడు హీరో రణ్‍బీర్ కపూర్ పంచెకట్టులో ఎంట్రీ ఇస్తాడు. మాస్కులు వేసుకున్న గ్రూప్‍ను గొడ్డలితో నరికేస్తాడు. ఈ నరుకుడే చివరి వరకు ఉంటుంది. ఇలా సాగింది యానిమల్ ప్రీ టీజర్. మొత్తంగా ఓ మోస్ట్ వైలెంట్ మూవీని సందీప్ వంగా తీసుకొస్తున్నారని అర్థమైపోయింది.
యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్ పక్కన హీరోయిన్‍గా రష్మిక మందన్న నటిస్తుండగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 11వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ వాయిదా పడలేదని ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యానిమల్ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.