Rana Naidu Web Series Review: రానా నాయుడు వెబ్ సిరీస్ రివ్యూ - వెంకటేష్, రానా ఓటీటీ ఎంట్రీ ఎలా ఉందంటే
Rana Naidu Web Series Review: వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే…
Rana Naidu Web Series Review: దగ్గుబాటి హీరోలు వెంకటేష్(Venkatesh), రానా(Rana Daggubati) తొలిసారి కలిసి నటించిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. అమెరికన్ డ్రామా సిరీస్ రే డొనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఈ సిరీస్ రిలీజైంది. ఈ సిరీస్‌తో వెంకటేష్, రానా ప్రేక్షకుల్ని మెప్పించారా? వారి ఓటీటీ డెబ్యూ ఎలా ఉందో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
తండ్రీ కొడుకుల కథ...
ముంబాయిలో సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య ఎదురైన పరిష్కరిస్తుంటాడు రానా నాయుడు( రానా). భార్యాపిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కుటుంబమే అతడి ప్రాణం. అతడిని తేజ్‌నాయుడు (సుశాంత్ సింగ్) జఫ్ఫానాయుడు (అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముళ్లు ఉంటారు.
రానా నాయుడికి భిన్నంగా వారి లైఫ్‌స్టైల్ ఉంటుంది. రానా నాయుడు తండ్రి నాగనాయుడు (వెంకటేష్) పదిహేనేళ్లు జైలు శిక్షను అనుభవించి విడుదలవుతాడు. తండ్రి జైలు నుంచి విడుదల కావడం రానా నాయుడుకు నచ్చదు. అతడిని అనుక్షణం ద్వేషిస్తుంటాడు. చివరికి నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడడు. అందుకు గల కారణమేమిటి? నాగనాయుడును చేయని నేరానికి జైలుకు పంపించింది ఎవరు?
తండ్రీకొడుకుల పోరాటంలో ఎవరి పంతం నెగ్గింది? సూర్య (ఆశీష్ విద్యార్థి) అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కారణంగా రానా నాయుడికి ఎదురైన సమస్యను నాగనాయుడు ఎలా పరిష్కరించాడు? ఆ గ్యాంగ్ స్టర్ బారి నుంచి తన కుటుంబాన్ని రానా నాయుడు ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సిరీస్ కథ.
మోడ్రన్ స్టైల్‌లో...
యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి రూపొందించిన సిరీస్ ఇది. కంప్లీట్ మోడ్రన్ సెటప్‌లో కథ సాగుతుంది. అందుకు తగినట్లుగానే ఎక్కువగా మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కనిపిస్తాయి.
తండ్రిని ద్వేషించే ఓ కొడుకు, అతడికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించే తండ్రి సింపుల్‌గా ఈ రెండు క్యారెక్టర్స్ చూట్టే ఈ కథ సాగుతుంది. ఈ రెండు పాత్రలతో మిగిలిన క్యారెక్టర్స్‌ను లింక్ చేస్తూ పది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకద్వయం కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ.
ఫస్ట్ ఎపిసోడ్‌తోనే...
బాలీవుడ్ సెలబ్రిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా రానా పాత్ర ఎంట్రీ ఇచ్చే సీన్‌తోనే సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తించారు దర్శకులు. ఆ తర్వాత జైలు నుంచి నాగనాయుడు రిలీజ్ రిలీజ్ కావడం, తన కొడుకులను కలుసుకునే సీన్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ సాగుతుంది. ఈ ఎపిసోడ్ చివరలో వెంకటేష్, రానా ఎదురుపడే సన్నివేశం నుంచి అసలు కథ మొదలవుతుంది.
కొడుకు రానానే తనను జైలు పాలు చేశాడని గ్రహించిన నాగ అతడిని ఎదుర్కోనడానికి వేసే ఎత్తులు, తండ్రి వేసే సవాళ్లను చిత్తుచేస్తూనే సెలబ్రిటీ సమస్యలను రానానాయుడు ఎలా చక్కదిద్దాడనే అంశాల చుట్టూ చివరి వరకు సిరీస్ సాగుతుంది.
తండ్రి నాగను కొడుకు రానా నాయుడు ఎందుకు ద్వేషిస్తున్నాడో చివరి ఎపిసోడ్‌లో చూపించారు. ఆ తర్వాత కొడుకుకు ఎదురయ్యే సమస్యను నాగ పరిష్కరించే సీన్‌తో సిరీస్‌ను ఎండ్ చేశారు.
సింపుల్ స్టోరీ...
రానా నాయుడులో చెప్పుకోవడానికి పెద్దగా కథ లేదు. క్యారెక్టరైజేషన్స్‌ను డిఫరెంట్‌గా మలుస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించడానికి ప్రయత్నించారు దర్శకులు. సిరీస్ చాలా వరకు బోర్ కొట్టించింది.
ఫ్యామిలీ ఎమోషన్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తండ్రిని రానానాయుడు ద్వేషించడానికి గల కారణాల్లో డెప్త్ లేదు. రానా నాయుడు సోదరులు పాత్రల్లోని ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదు.
పోటాపోటీగా...
రానా నాయుడి, నాగనాయుడిగా వెంకటేష్ రానా పాత్రలో పోటీపోటీగాసాగాయి. తనకున్న ఫ్యామిలీ ఇమేజ్‌కు భిన్నంగా ప్లేబాయ్ తరహా పాత్రలో వెంకటేష్ చెలరేగిపోయాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అతడి మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి.
రానా నాయుడిగా నెగెటివ్ షేడ్స్‌లో కూడిన పాత్రలో రానా నటన పవర్‌ఫుల్‌గా ఉంది. సీరియస్ రోల్‌లో జీవించాడు. రానా వైఫ్‌గా సుర్వీన్ చావ్లా, సోదరులుగా సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ ల నటన సిరీస్‌కు ప్లస్‌గా నిలిచింది. ఆశీష్ విద్యార్థి విలనిజం రొటీన్‌గా ఉంది.
Rana Naidu Web Series Review- యాక్టింగ్ కోసం...
వెంకటేష్, రానా యాక్టింగ్ కోసం రానా నాయుడు సిరీస్‌ను చూడొచ్చు. కంప్లీంట్ యూత్ ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రానా నాయుడు సిరీస్‌ను రూపొందించారు. ఫ్యామిలీతో కలిసి సిరీస్ చూడటం మాత్రం అసాధ్యమే అని చెప్పవచ్చు.