Rana Naidu Out from Netflix: షాకింగ్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు తెలుగు వెర్షన్ ఔట్
Rana Naidu Out from Netflix: షాకింగ్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు తెలుగు వెర్షన్ తీసేశారు. బూతుల డోసు ఎక్కువైందంటూ మొదటి నుంచీ ఈ సిరీస్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Rana Naidu Out from Netflix: టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చింది. అయితే ఆ ఓటీటీలో చాలా వరకూ ఉండే బూతు కంటెంట్ లాగే ఈ సిరీస్ కూడా పక్కా బూతులతో ఫ్యామిలీ అంతా కలిసి చూడలేని విధంగా ఉంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ సిరీస్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై రానా కూడా స్పందించి ఈ సిరీస్ ను ఒంటరిగానే చూడాలని కోరాడు. క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు విమర్శలు మరీ ఎక్కువవడం వల్లో మరేంటోగానీ నెట్‌ఫ్లిక్స్ లో ఈ రానా నాయుడు తెలుగు వెర్షన్ తీసేశారు. ప్రస్తుతం ఈ ఓటీటీలో తెలుగు ఆడియో అందుబాటులో లేదు. నిజానికి ఈ సిరీస్ ను హిందీలోనే తీశారు.
తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. ఆ డబ్బింగ్ సమయంలో బూతులు మాట్లాడటానికి తాను కూడా ఇబ్బందిగా ఫీలైనట్లు వెంకటేశ్ చెప్పాడు. అంతటి సీనియర్ నటుడు, ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన వెంకటేశ్ ఇలాంటి బూతు సిరీస్ లో నటించడం ఏంటని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ మాయమవడంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు.
కావాలనే తీసేశారా లేక పొరపాటున కనిపించకుండా పోయిందా అన్నది తెలియలేదు. అమెరికన్ సిరీస్ అయిన రే డోనోవాన్ కు ఇండియన్ రీమేకే ఈ రానా నాయుడు. ఈ సిరీస్ ను కరణ్ అన్షుమన్ డైరెక్ట్ చేశాడు. సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
సంబంధిత కథనం