Rajinikanth: జైలర్ తర్వాత కథలు వినడం మానేశా - రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajinikanth: జైలర్ తర్వాత ఆ స్థాయి సినిమా చేయాలని చాలా కథలు విన్నానని, కానీ అవేవీ తనకు నచ్చలేదని రజనీకాంత్ అన్నారు. ఒకానొక టైమ్‌లో కథలు వినడం మానేశానని చెప్పాడు. వెట్టైయాన్ మూవీ లోకేష్ కనగరాజ్, నెల్సన్ టైప్ కమర్షియల్ మూవీ కాదని రజనీకాంత్ అన్నాడు.
Rajinikanth: వెట్టైయాన్ లోకేష్ కనగరాజ్, నెల్సన్ స్టైల్ కమర్షియల్ మూవీ కాదని రజనీకాంత్ అన్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన తమిళ మూవీ వెట్టైయాన్ ది హంటర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ వెట్టైయాన్ మూవీని నిర్మిస్తోంది. ఈ యాక్షన్ మూవీలో అమితాబ్‌బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. వెట్టైయాన్ ఆడియె వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది.
కథలు వినడం మానేశా…
ఈ వేడుకలో వెట్టైయాన్ మూవీపై రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “సాధారణంగా బ్లాక్‌బస్టర్ తర్వాత చేసే సినిమాల విషయంలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లలో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ మూవీతో అంతకంటే పెద్ద హిట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం తాను అదే టెన్షన్‌లో ఉన్నానని” వెట్టైయాన్ ఆడియో వేడుకలో రజనీకాంత్ అన్నారు.
“సినిమా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ కుదరాలి. జైలర్ హిట్ తర్వాత నేను చాలా కథలు విన్నాను. అవేవి గొప్పగాలేవనిపించింది. కొన్నాళ్లకు కథలు వినటం మానేశాను. అలాంటి టైమ్‌లోనే నా కూతురు సౌందర్య వెట్టైయాన్ కథ నా దగ్గరకు వచ్చిందని” రజనీకాంత్ అన్నారు.
నా స్టైల్ వేరు...
“జ్ఞానవేల్ దగ్గర మంచి కథ ఉందని, వినమని సౌందర్య నాతో చెప్పింది. కథ వినడానికి ముందు మరోసారి జైభీమ్ సినిమా చూశాను. ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయని వ్యక్తి, జై భీమ్‌ను ఎంత గొప్పగా ఎలా తీశాడా అని ఆలోచించాను. తర్వాత జ్ఞానవేల్‌తో ఫోన్లో మాట్లాడి కలిశాను. మీ టైప్ సందేశాత్మక సినిమా కాకుండా నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది” అని రజనీకాంత్ చెప్పారు
లోకేష్, నెల్సన్ టైప్ మూవీ కాదు...
"వెట్టైయాన్ కథను డెవలప్ చేయడానికిపది రోజుల సమయం అడిగిన డైరెక్టర్.. రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో వెట్టైయాన్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది.
అమితాబ్‌బచ్చన్ ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాలో స్ఫూర్తిని నింపిన వ్యక్తి. ఇప్పటి జనరేషన్‌కు అమితాబ్ ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను" అని రజనీకాంత్ తెలిపారు.
ఈ జనరేషన్‌లో చూడలేదు...
“వెట్టైయాన్ మూవీలో ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. కానీ చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు. రామానాయుడుగారి మనవడిగా రానా బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు. తను చాలా మంచి యాక్టర్. బాహుబలి సహా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు” అని రజనీకాంత్ అన్నారు.
రజనీకాంత్ స్టైల్ మాస్ సీన్స్‌తో ఈ మూవీ ఉంటుందని, ఊహించినదానికంటే డబుల్‌గా అభిమానులను ఈ మూవీ మెప్పిస్తుందని దర్శకుడు అన్నాడు.