Raj Tarun New Movie Launches: చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్‌కు అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ రూపంలో హిట్ దక్కింది. ఈ ఆనందంలో ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు అతడు హిట్ డైరెక్టర్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్లు అందుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
తిరగబడారా సామీ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ప్రకటించారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత పోకూరి బాబురావు స్క్రీప్టును ఏఎస్ రవికుమార్‌కు అందజేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రం తెరకెక్కుతుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకులు వీర శంకర్, రాజా వన్నెంరెడ్డి, నిర్మాతలు టీ ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, డీఎస్ రావు, నటి నిర్మాత జీవితా రాజ శేఖర్ పాల్గొన్నారు.
సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జేబీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బెక్కెం రవీందర్ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్