Aha Naa Pellanta Webseries Review: రాజ్ తరుణ్‌కు హిట్ పడిందా? వెబ్‌సిరీస్‌లోనైనా కలిసొచ్చిందా?
Aha Naa Pellanta Web series Review: రాజ్ తరుణ్ హీరోగా, శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటించిన తాజా వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఈ సిరీస్ నవంబరు 17న జీ5 వేదికగా విడుదలైంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉంది? రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా లేదా తెలియాలంటే ఇది చూడాల్సిందే
Aha Naa Pellanta Web series Review: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు సరైన హిట్ పడి చాలా రోజులే అయిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరో.. ఓ పక్క సినిమాలు చేస్తూనే తన ఫోకస్ వెబ్‍సిరీస్ పైనా పెట్టాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన తాజా సిరీస్ అహ నా పెళ్లంట. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా? లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.
నటీనటులు- రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హార్షవర్థన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, గెటప్ శ్రీను, భద్రమ్ తదితరులు.
దర్శకత్వం- సంజీవ్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే- షేక్ దావూద్ జీ
సంగీతం- జుడా శాండీ
నేపథ్య సంగీతం- పవన్
సినిమాటోగ్రఫీ- నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ
ఎడిటర్- మధురెడ్డి
విడుదల తేదీ- 2022 నవంబరు 17, జీ5లో స్ట్రీమింగ్
కథ..
నో బాల్ నారాయణ(హర్ష వర్ధన్), సుశీల(ఆమని) ముద్దుల కుమారుడు శ్రీను(రాజ్ తరుణ్). చిన్నప్పుడు ఓ సారి స్కూల్‌లో ఓ అమ్మాయికి అందరిముందు ప్రపోజ్ చేయడంతో.. అది చూసిన తండ్రి అతడిని మందలిస్తాడు. అంతటితో ఆగకుండా భార్యతో చెప్పి ఇక నుంచి పెళ్లి అయ్యేంత వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనని శ్రీను నుంచి ప్రామీస్ తీసుకుంటాడు. ప్రామీస్ చేసినట్లే శ్రీను కూడా ఏ అమ్మాయి జోలికి వెళ్లడు. ఒకవేళ ఏ అమ్మాయినైనా చూసినా.. తండ్రి నారాయణకు ఏదోక ప్రమాదం జరుగుతుంటుంది. అతడు పెరిగి పెద్దయ్యే వరకు ఇదే తంతు జరుగుతుంది. తన వల్లే తండ్రికి ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన శ్రీను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెబుతాడు. ఎన్నో సంబంధాల చూసిన తర్వాత ఓ అమ్మాయితో అతడికి పెళ్లి నిశ్చయమవుతుంది. తీరా తాళీ కట్టే సమయానికి ఆ అమ్మాయి.. తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. అందరూ ఎగతాళీగా చూడటంతో తండ్రి రాజ్ తరుణ్‌ను హైదరాబాద్ పంపిస్తాడు.
తన పెళ్లి చెడిపోవడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్) అనే అమ్మాయి అని తెలుసుకుని ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అక్కడ నుంచి ఎన్నో మలుపులతో కథ సాగుతుంది. మరి ఆ మలుపులేంటి? శ్రీను పెళ్లి చెడిపోవడానికి మహా ఎలా కారణమైంది? ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ 40 నిమిషాలు మినహా మిగిలినవన్నీ అరగంట లోపే ఉన్నాయి. మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకులు కథలోకి వెళ్లిపోతారు. పెళ్లి చెడిపోవడం వరకు మొదటి ఎపిసోడ్‌లోనే ఉండటం వల్ల ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా హర్షవర్ధన్, రాజ్ తరుణ్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే రెండో ఎపిసోడ్ మాత్రం కాస్త నిదానంగా సాగుతుంది. కథ కొంచెం రొటీన్‌గానే ఉందని ఈ ఎపిసోడ్‌తోనే అర్థమవుతుంది. అయితే హీరో ఎప్పుడైతే హైదరాబాద్‌కు వెళ్తాడో అక్కడ నుంచి సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. హీరోయిన్‌ను కిడ్నాప్ చేయడం, ఆ ఉదంతం నుంచి బయటపడటం, ఆమెతో కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండటం ఇవన్నీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తాయి. హీరో స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.
మూడు ఎపిసోడ్ మధ్య నుంచి 4, 5 ఎపిసోడ్‌లు ఫన్నీగా సాగుతాయి. ఆరో ఎపిసోడ్‌ను స్టోరీలో ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చేందుకు శ్రీను సాయపడటం ఆ సీన్లన్నీ బాగుంటాయి. వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా ఫర్వాలేదనిపించాయి. అయితే మధ్య మధ్యలో కొన్ని రొటీన్ సన్నివేశాల కారణంగా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. ఇలాంటి కథకు కామెడీని జోడించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశారు. రొటీన్ కథను.. స్కీన్ ప్లే సాయంతో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ నమ్మశక్యంగా అనిపంచదు. ఎయిర్‌పోర్టులో బాంబ్ అనే సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీ తేల్చేశారు. ఈ విషయంలో కొన్ని లాజిక్స్ పట్టించుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
కెరీర్ ప్రారంభం నుంచి రాజ్ తరుణ్ తనకు నప్పిన పక్కింటి కుర్రాడి పాత్రల్లో బాగా పర్ఫార్మ్ చేస్తాడు అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లోనూ అలాంటి పాత్రతో అదరగొట్టాడు. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడిగానే కాకుండా.. ప్రేమికుడి పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ శివానీ రాజశేఖర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె క్యారెక్టర్ కాస్త విభిన్నంగా ఉంటుంది. అద్భుతం చిత్రం చూసిన వారికి ఆమె ఎంత పర్ఫార్మ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాజాగా అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్‌లోనూ మరోసారి మంచి ప్రదర్శన చేసింది. ఈ పాత్రలో ఆమె జీవించింది. తల్లి పాత్రలో ఆమని ఫర్వాలేదనిపిస్తుంది. తండ్రి పాత్రలో హర్ష వర్ధన్ తన పాత్ర పరిధి మేరకు అదరగొట్టాడు. లేచిపోయిన పెళ్లి కూతురు పాత్రలో నటించిన దీపాలి శర్మ ఫర్వాలేదనిస్తుంది. హీరో స్నేహితులుగా చేసిన రవి శివతేజ, త్రిశూల్ ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌లో కామెడీనంత తమ భుజాలపైనే మోశారు. పోసాని కృష్ణమురళీ ఎపపటిలాగే తనకు నప్పిన కన్నింగ్ పాత్రలో మెరిశారు. ఈ సిరీస్‌లో ఓ రకంగా విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే. తన పాత్రలో బాగానే ఒదిగిపోయారు. మిగిలినవారంతా ఓకే.
సాంకేతిక వర్గం..
రొటీన్ స్టోరీ ఇంత ఆసక్తిగా సాగడానికి గల క్రెడిట్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డికే ఇవ్వాలి. ముఖ్యంగా దీన్ని ఓ సిరీస్‌లా కాకుండా సినిమా టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. 8 ఎపిసోడ్‌లు ఉన్నప్పటికీ.. కథకు డిస్ కనెక్ట్ అవ్వకుండా లీనమయ్యేలా చేశాడు. పాటలు, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. నిర్మాణ విలువలు బాగా కుదిరాయి. సిరీస్‌లా కాకుండా మూవీలా ఉందంటేనే నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారని అర్థమవుతుంది. పాటలు గుర్తుండిపోయేలా లేనప్పటికీ.. కథకు అనుగుణంగా బాగానే ఉన్నాయి. టైటిల్ సాంగ్ బాగుంటుంది. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్ పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ.. అందరూ కూర్చుని చూడగలిగే ఓ మంచి టైం పాస్ సిరీస్
రేటింగ్- 3/5.
సంబంధిత కథనం