PS-1 Enters 500 Crore Club: 500 కోట్ల క్లబ్‌లో పొన్నియిన్ సెల్వన్.. మరో అరుదైన ఘనత-ps1 movie reaches 500 crores mark in 50 days
Telugu News  /  Entertainment  /  Ps-1 Movie Reaches 500 Crores Mark In 50 Days
పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్

PS-1 Enters 500 Crore Club: 500 కోట్ల క్లబ్‌లో పొన్నియిన్ సెల్వన్.. మరో అరుదైన ఘనత

19 November 2022, 9:19 ISTMaragani Govardhan
19 November 2022, 9:19 IST

PS-1 Enters 500 Crore Club: మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 50 రోజుల్లో 500 కోట్ల మార్కును అందుకుందీ చిత్రం. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కింది.

PS-1 Enters 500 Crore Club: మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం పాన్ఇండియా వ్యాప్తంగా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని తెచ్చుకున్నప్పటికీ తమిళనాడులో మాత్రం అదిరపోయే వసూళ్లతో దుమ్మురేపింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఫలితంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలియజేసింది.

50 అద్భుతమైన రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకా కనసాగుతూనే ఉంది. అని లైకా సంస్థ ట్వీట్ చేసింది. అనంతరం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన విక్రమ్ కూడా తన ఆనందాన్ని పోస్టు రూపంలో తెలియజేశారు. "ఎవరైనా నన్ను గిల్లి ఇది కల కాదు అని చెప్పండి" అంటూ విక్రమ్ ట్వీట్ చేశారు.

రూ.500 కోట్ల వసూళ్లతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం అత్యదిక కలెక్షన్లు రాబట్టిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్-2 సరసన చేరింది. అంతేకాకుండా ఈ ఏడాది 500 పైచిలుకు వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. పీఎస్-1 కంటే ముందు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 చిత్రాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లతో ముందు వరుసలో ఉన్నాయి. మూడో పీఎస్-1 ఉండగా.. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు తదుపరి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 కలెక్షన్లతో పోలిస్తే పీఎస్-1 మధ్య అంతరం చాలా ఉన్నప్పటికీ.. 500 కోట్ల మైలురాయిని ఈ చిత్రం అధిగమించింది. రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెప్టెంబరు 30న విడుదలైంది. రెండో భాగం కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదటి పార్ట్ రిలీజైన 6 నుంచి 9 నెలల్లోగా రెండో పార్ట్‌ను విడుదల చేస్తామని మణిరత్నం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి వచ్చే ఏడాది వేసవిలో పీఎస్-2 వచ్చే అవకాశం ఉంది.

పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా.. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఐమాక్స్‌లో విడుదలైన మొదటి తమిళ సినిమా ఇదే కావడం విశేషం.

సంబంధిత కథనం