Pawan Kalyan Remuneration: రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటా.. పవన్ కల్యాణ్ బోల్డ్ స్టేట్మెంట్
Pawan Kalyan Remuneration: రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటా అంటూ తన రెమ్యునరేషన్ పై పవన్ కల్యాణ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. డబ్బు కోసం తాను అధికారంలోకి రావాలని అనుకోవడం లేదంటూ చెబుతూ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.
Pawan Kalyan Remuneration: పవన్ కల్యాణ్.. టాలీవుడ్ పవర్ స్టార్. అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు తెలుగులో ఏ హీరోకూ లేనంత మంది అభిమానులు అతని సొంతం. మరి అలాంటి హీరో ఓ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో ఊహించండి. సాధారణంగా ఏ హీరో లేదా హీరోయిన్ తమ రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించరు.
కానీ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయంగానే క్రియాశీలకంగా ఉన్న పవన్.. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పేరుతో ఓ పార్టీ పెట్టిన సంగతి తెలుసు కదా. తెలంగాణ కంటే ఏపీలో రాజకీయంగా పవన్ యాక్టివ్ గా ఉన్నాడు. అక్కడి అధికార పార్టీపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే తనపై వచ్చిన విమర్శలకు కూడా సమాధానం ఇస్తున్నాడు పవన్.
ఈ నేపథ్యంలో ఈ మధ్యే ఓ రాజకీయ ర్యాలీలో పవన్ తాను తీసుకునే రెమ్యునరేషన్ గురించి వెల్లడించాడు. తాను డబ్బు కోసమే అధికారంలోకి రావాలని చూస్తున్నానన్న విమర్శలపై స్పందిస్తూ.. తనకు డబ్బుతో పనిలేదని, సినిమాల్లోనే భారీగా సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగానే తాను ఒక రోజు షూటింగ్ కోసం రూ.2 కోట్లు తీసుకుంటానని చెప్పాడు.
"నాకు డబ్బు అవసరం లేదు. నేను అలాంటి మనిషిని కాను. అవసరమైతే నేను సంపాదించి కూడా దానం చేస్తా. నేను ఎలాంటి భయం లేకుండా చెబుతున్నాను. ఇప్పుడు నేనో సినిమా షూటింగ్ చేస్తున్నా. దాని కోసం రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నా. అంటే 20 రోజుల షూటింగ్ కు నాకు రూ.45 కోట్ల వరకూ వస్తున్నాయి. నేను ప్రతి సినిమాకు ఇంత సంపాదిస్తున్నానని చెప్పడం లేదు. కానీ నా సగటు రోజువారీ రెమ్యునరేషన్ అంత ఉంటుంది. అలాంటి స్టేటస్ నాకు మీ వల్లే వచ్చింది" అని ఆ ర్యాలీలో మాట్లాడుతూ పవన్ చెప్పాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్.. తమిళ మూవీ వినోధాయ సిద్ధం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. తమిళంలో సముద్రఖని పోషించిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రాబోతోంది.
సంబంధిత కథనం