Patriotic Song Lyrics: దేశభక్తి గేయం ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాంగ్ లిరిక్స్ ఇవే.. పంద్రాగస్టునాడు పాడుకోండి
Patriotic Song Lyrics: దేశభక్తి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. గురువారం (ఆగస్ట్ 15) ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ పాట పాడుతూ దేశభక్తిని చాటి చెప్పండి.
Patriotic Song Lyrics: స్వతంత్ర భారతదేశం గురువారం (ఆగస్ట్ 15) తన 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఊరూవాడా ఈ సంబురాలను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లీల్లోని స్కూళ్ల నుంచి ఢిల్లీ వరకు ఆ రోజంతా దేశభక్తి పాటలతో మార్మోగనుంది. మరి మీరు కూడా ఓ గేయంతో దేశభక్తిని చాటుదామని అనుకుంటున్నారా? అయితే ఏ దేశమేగినా పాట లిరిక్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.
ఏ దేశమేగినా లిరిక్స్
ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే తెలుగు దేశభక్తి పాటను మొదట రాయప్రోలు సుబ్బారావు రాశారు. ఈ పాటను అలాగే 1954లో వచ్చిన పరివర్తన సినిమాలో వాడుకున్నారు. ఆ తర్వాత సి. నారాయణరెడ్డి ఇదే పాటను కాస్త సవరించి రాశారు. ఆ పాటను 1987లో సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన అమెరికా అబ్బాయి సినిమాలో వాడుకున్నారు. ఆ పాటకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఆ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
అయితే ఇక్కడ మేము అందిస్తున్న లిరిక్స్ రాయప్రోలు సుబ్బారావు రాసిన ఒరిజినల్ సాంగ్‌వి.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో
జనియించినాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్ ప్రేమించినావో
నినుమోసె యీ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లిలేదు
పాడరా నీ తెల్గు బాలగీతములు
పాడర నీ వీర భావ భారతము
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగ
సౌర్యహారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువు లల్లంగ
రాగ దుగ్ధము భక్త రత్నముల్ పిదుక
దిక్కుల కెగదన్ను తేజమ్మువెలుగ
రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనం బెగయ
సౌందర్య మెగబోయు సాహిత్యమలరు
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట
పృధివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలారా ? అనుమానమేల ?
భారతీయుడనంచు భక్తితో పాడ.