Patna Shuklla Review: ఓ ఎడ్యుకేషన్ స్కామ్.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్.. రవీనా టండన్ పట్నా శుక్లా చూడాల్సిన మూవీనే..
Patna Shuklla Review: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి శుక్రవారం (మార్చి 29) వచ్చిన పట్నా శుక్లా మూవీ ఎలా ఉంది? ఓ ఎడ్యుకేషన్ స్కామ్, ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ తో ఈ వీకెండ్ లో ఈ మూవీ చూడదగినదే అని చెప్పొచ్చు.
Patna Shuklla Review: తాను ఓ సాధారణ గృహిణి మాత్రమే కాదు సమర్థమైన లాయర్ కూడా అని నిరూపించుకునే క్రమంలో తన్వీ శుక్లా అనే ఓ మహిళ పట్నా శుక్లాగా ఎలా పేరుగాంచింది? బీహార్లో ఏళ్లుగా విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న స్కామ్ ను ఎలా బయటపెట్టింది అన్నదే ఈ పట్నా శుక్లా స్టోరీ.
ఈ స్కామ్ తోపాటు చివర్లో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ తో ఈ సినిమా ఆసక్తి రేపింది. హాట్‌స్టార్ లో శుక్రవారం (మార్చి 29) రిలీజైన ఈ మూవీలో తన్వీ శుక్లా అనే లాయర్ గా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టండన్ నటించింది. ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
మూవీ: పట్నా శుక్లా
నటీనటులు: రవీనా టండన్, మానవ్ విజ్, సతీష్ కౌశిక్, చందన్ రాయ్ సన్యాల్, అనుష్క కౌశిక్
డైరెక్టర్: వివేక్ బుడకోటి
నిర్మాత: అర్బాజ్ ఖాన్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
పట్నాశుక్లా స్టోరీ ఏంటంటే?
తన్వీ శుక్లా (రవీనా టండన్) అనే ఓ సాధరణ హౌజ్ వైఫ్ ఓ సమర్థవంతమైన లాయర్ గా ఎదగాలని అనుకుంటుంది. అయితే సమాజంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నట్లే ఇంట్లో తన భర్త సహా అందరి వివక్ష ఎదుర్కొంటూ ఉంటుంది. కోర్టుల్లో ఏవో చిన్న చిన్న కేసులు వాదిస్తూ నిలదొక్కుకోవాలని చూస్తుంది. అలాంటి తన్వీ దగ్గరికి ఓ రోజు ఓ పవర్ ఫుల్ కేసు వస్తుంది.
విహార్ యూనివర్సిటీ చేసిన తప్పుకు తన భవిష్యత్తే నాశనం అవుతుందని, తనకు రావాల్సిన మార్కుల కంటే చాలా తక్కువ వేసి ఫెయిల్ చేశారని, తన జీవితంతో ఆడుకుంటున్నారని ఓ యువతి (అనుష్క కౌశిక్) ఆమె దగ్గరికి వస్తుంది. మొదట్లో ఓ సాదాసీదా కేసులాగే అనిపించినా.. తీగ లాగితే డొంక కదిలినట్లు అది ఓ పెద్ద స్కామ్ అని తేలుతుంది.
దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయనీ, కేసు వదిలేయాల్సిందిగా ఆమెపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తాయి. అయితే వీటన్నింటినీ తట్టుకొని ఆమె న్యాయం కోసం చేసే పోరాటమే ఈ పట్నా శుక్లా మూవీ. ఈ కేసు గెలవడానికి చివరికి తన కెరీర్ నే పణంగా పెట్టడానికీ సిద్ధమవుతుంది. మూవీ చివర్లో ఉండే ఎవరూ ఊహించని ట్విస్ట్ కూడా ఇదే. ఆ ట్విస్ట్ తోనే ఈ సినిమా మరింత ఆసక్తి రేపుతుంది.
పట్నా శుక్లా ఎలా ఉంది?
సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అంటే చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది. కోర్టులో వాదోపవాదాలు, ఎత్తుకుపైఎత్తులు, ట్విస్టులు ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇంట్రెస్టింగా చేస్తాయి. ఆ లెక్కన చూస్తే పట్నా శుక్లా కాస్త నిరాశ పరుస్తుంది. ఎడ్యుకేషన్ స్కామ్, దానిపై పోరాటం చేసే మహిళా లాయర్ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా స్క్రిప్ట్ లో లోపాలు సినిమాను కాస్త బలహీన పరిచాయి.
నిజానికి ఈ మూవీకి అతిపెద్ద బలం రవీనా టండనే. ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ఆమె.. ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రకు సరైన న్యాయం చేసింది. ఇక దివంగత సతీష్ కౌశిక్ కూడా జడ్జి పాత్రలో తనదైన ముద్ర వేశాడు. ఇదే అతనికి చివరి సినిమా. దీని తర్వాత అతడు కన్నుమూశాడు. ఈ మూవీలో అతని చివరి సీన్ కూడా దూరంగా నడుచుకుంటూ వెళ్లేదే కావడం చూస్తుంటే మనసు కాస్త చివుక్కుమంటుంది.
రెండున్నర గంటల ఈ సినిమా నిడివి కూడా కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు మరికాస్త పని పెడితే బాగుండేదని కొన్ని సీన్లు చూస్తే తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం పట్నా శుక్లా మూవీ చూడదగినదే అని చెప్పొచ్చు. పరీక్షా పత్రాలపై రోల్ నంబర్లు మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఓ స్కామ్ ను ఈ మూవీ ద్వారా మేకర్స్ కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
గతంలో బాలీవుడ్ లో వచ్చిన కోర్టు రూమ్ డ్రామాల స్థాయిలో లేకపోయినా.. తాము ఇవ్వాల్సిన సందేశాన్ని మాత్రం మేకర్స్ ఈ పట్నా శుక్లా ద్వారా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించారు. హాట్‌స్టార్ లో ఓ వీకెండ్ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.
టాపిక్