Patna Shuklla trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా.. పట్నా శుక్లా ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Patna Shuklla trailer: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ నటించిన థ్రిల్లింగ్ కోర్ట్ రూమ్ డ్రామా పట్నా శుక్లా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ సోమవారం (మార్చి 11) రిలీజైంది.
Patna Shuklla trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ రాబోతోంది. బాలీవుడ్ నటి రవీనా టండన్ నటించిన పట్నా శుక్లా మూవీ ట్రైలర్ సోమవారం (మార్చి 11) రిలీజ్ కాగా.. ఈ మూవీ మార్చి 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. విద్యా వ్యవస్థలోని అతిపెద్ద స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది.
పట్నా శుక్లా ట్రైలర్
బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇప్పటికే ఓటీటీలో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లోని ఆర్యనాక్, కర్మ కాలింగ్ అనే షోలతో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఇప్పుడు పట్నా శుక్లా అనే మూవీతో రాబోతోంది. ఇందులో రవీనా ఓ లాయర్ పాత్ర పోషించింది. తన్వీ శుక్లా అనే ఓ హోమ్ మేకర్, పార్ట్ టైమ్ లాయర్ గా రవీనా అలరించనుంది.
బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ తోనే అసలు కథేంటన్నది స్పష్టంగా చెప్పేశారు. మార్కులను తారుమారు చేస్తూ విద్యార్థులను జీవితాలతో చెలగాటమాడే ఓ స్కామ్ పై తన్వీ శుక్లా అనే మహిళా లాయర్ చేసిన పోరాటమే ఈ పట్నా శుక్లా మూవీ కథ. ఈ క్రమంలో ఆమె, ఆమె కుటుంబం ఎదుర్కొనే సవాళ్లను ట్రైలర్ లో చూపించారు.
పట్నా శుక్లా మూవీ స్ట్రీమింగ్
ఓ గృహిణిగా నోరూరించే వంటకాలు చేయడమే కాదు.. ఆమె ఓ లాయర్ కూడా అంటూ తన్వీ శుక్లా పాత్రను పరిచయం చేయడంతో ఈ పట్నా శుక్లా మూవీ ట్రైలర్ మొదలవుతుంది. ఏవో చిన్న చిన్న కేసులు వస్తాయంతే.. అఫిడవిట్లు బాగా చేస్తుందంటూ ఆమె భర్త తక్కువ చేసి మాట్లాడతాడు. అలాంటి పార్ట్ టైమ్ లాయర్ దగ్గరికి ఓ పెద్ద ఎడ్యుకేషన్ స్కామ్ కు సంబంధించిన కేసు వస్తుంది.
తనకు 60 శాతం రావాల్సిన మార్కులు 30 శాతమే వచ్చాయంటూ ఫెయిల్ చేశారని ఓ అమ్మాయి తన్వీ శుక్లా దగ్గరికి వస్తుంది. ఆమె కేసు వాదన కాస్తా పెద్ద స్కామ్ ను వెలికి తీస్తుంది. ఆ స్కామ్ లో పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా ఉండటం, ఈ కేసును వదులుకోవాలని ఆమెపై ఒత్తిడి తేవడం, ఆమె భర్త ఉద్యోగం కోల్పోవడంలాంటి సవాళ్లను తన్వీ ఎదుర్కొంటుంది.
అయినా తాను వెనుకడుగు వేయనంటూ ఈ కేసుపై పోరాటం కొనసాగిస్తుంది. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడొచ్చు. ఎడ్యుకేషన్ స్కామ్, కోర్టు రూమ్ డ్రామా కలగలపిన ఈ సినిమా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించగా.. వివేక్ బుడకోటి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రతి భారతీయ మహిళ తనను తాను చూసుకుంటుందని రవీనా టండన్ చెబుతోంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోనే పట్నా శుక్లా మూవీ రిలీజ్ కాబోతోంది. మార్చి 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.