Prabhas Donation to Temple: భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం.. ప్రత్యేక పూజలు
Prabhas Donation to Temple: భద్రాద్రి రాముడికి ప్రబాస్ విరాళం సమర్పించారు. యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు ద్వారా రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు. ఈ డబ్బును అన్నదానానికి, గోశాల తదితర ఖర్చుల నిమిత్తం వాడనున్నారు.
Prabhas Donation to Temple: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే సమాజ సేవ, విరాళాలు లాంటి గుప్తంగా ఉంచుకుంటారు. తాజాగా భద్రాచలం సీతారాముల ఆలయానికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, శ్రీనివాస రెడ్డి శనివారం ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్కును అందించారు. అనంతరం ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభాస్ దానం చేసిన మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈఓ భవాని రామకృష్ణారావు వెల్లడించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యన్నదాన పథానికి కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. భారత్‌తో పాటు 70 దేశాల్లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే లభించింది. ఈ ట్రైలర్‌లో సీతమ్మ తల్లి గీత దాటడం, లంకా దహనం, రావణ సంహారం, రామసేతు నిర్మాణం శబరి ఎంగిపండ్లను తినే ఎపిసోడ్‌లను చూపించారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం