Padutha Theeyaga Tv Show: తెలుగు టీవీ షోస్‌లో పాడుతా తీయగా అరుదైన రికార్డ్ - త్వరలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
Padutha Theeyaga Tv Show: తెలుగులో ఎక్కువ కాలం పాటు కొనసాగుతోన్న సింగింగ్ టీవీ షోగా పాడుతా తీయగా రికార్డ్ సృష్టించింది. తాజాగా మరో అరుదైన మైలురాయికి పాడుతా తీయగా చేరుకుంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనున్న తొలి టీవీ షోగా నిలవనుంది.
Padutha Theeyaga Tv Show: తెలుగులో మొట్టమొదటి సింగింగ్ టీవీ షోగా పాడుతా తీయగా మొదలైంది. ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న పాడుతా తీయగా స్ఫూర్తితోనే తెలుగులో ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్ మొదలయ్యాయి. కానీ పాడుతా తీయగా స్థాయిలో క్రేజ్, పాపులారిటీని దక్కించుకోలేకపోయాయి. సింగింగ్ షోస్‌లో పాడుతా తీయగా షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఉంది.
24వ సీజన్ స్టార్ట్...
తెలుగు టీవీ షోస్‌లో సుధీర్ఘ కాలంగా కొనసాగుతోన్న టీవీ షోగా పాడుతా తీయగా పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకుంది. 24వ సీజన్ త్వరలోనే మొదలుకాబోతోంది. 1996లో మొదలైన పాడుతా తీయగా మరో సరికొత్త రికార్డకు చేరువైంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోనుంది. తెలుగులో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోన్న ఫస్ట్ టీవీ షోగా పాడుతా తీయగా నిలవనుంది.
500 మంది కంటెస్టెంట్లు...
ఈటీవీ పుట్టిన ఈ 30 ఏళ్లలో పాడుతా తీయగా షోకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. పాడుతా తీయగా ద్వారానే ఉష, గోపిక పూర్ణిమ, కౌసల్య, హేమచంద్ర, కారుణ్య, మల్లీఖార్జున్, సందీప్, లిప్సిక, హరిణితో పాటు ఎంతో మంది టాలీవుడ్ సింగర్స్ వెలుగులోకి వచ్చారు.
ఎస్‌పీ బాలు...
పాడుతా తీయగా 1996 నుంచి 2020 వరకు వరకు దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించారు. తెలుగు సినిమా పాటల గురించి ఆయన పంచుకున్న విశేషాలు, పంచిన సంగీత జ్ఞానం ఈ షోను తెలుగు వారందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి.
బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పాడుతా తీయగా షోకు హోస్ట్‌గా ఉంటున్నారు. ఎస్పీబీ వారసత్వాన్ని ఎస్‌పి చరణ్ ముందుకు తీసుకు వెళ్తున్నారు. మొత్తం ఇప్పటివరకు 1100 ఎపిసోడ్స్‌కిపైగా పాడుతా తీయగా టెలికాస్ట్ అయ్యింది. 1996 నుంచి 2000 ఏడాది వరకు టెలికాస్ట్ అయినా పాడుతా తీయగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. 2007 నుంచి గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఈటీవీలో ప్రసారం అవుతోంది.
ఆస్కార్ విన్నర్ చంద్రబోస్...
పాడుతా తీయగా షోకు ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్ గ్రహీత, పాటల రచయిత చంద్రబోస్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. చంద్రబోస్‌తో పాటు సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్‌లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు.
ఈ షోలో చిరంజీవి, ఇళయారాజా, కీరవాణి, జానకి, సుశీల, దేవిశ్రీప్రసాద్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు గెస్టులుగా పాల్గొన్నారు. పాడుతా తీయగా షోను ఈటీవీతో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.