OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు-ott telugu movies released this week kalki 2898 ad raayan grrr and more on amazon prime video hotstar and aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు

OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2024 09:43 PM IST

OTT Telugu Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ సహా తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇందులో ఐదు కీలకంగా ఉన్నాయి. వీటిలో మూడు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాల స్ట్రీమింగ్ వివరాలివే..

OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు
OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు

చాలా రోజుల నుంచి వేచిచూసిన బ్లాక్‍బస్టర్ సినిమా 'కల్కి 2898 ఏడీ' ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అలాగే మరిన్ని చిత్రాలు తెలుగులో ఈవారం (ఆగస్టు నాలుగో వారం) అందుబాటులోకి వచ్చాయి. తమిళ సూపర్ హిట్ రాయన్ చిత్రం కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు ఈవారమే అడుగుపెట్టింది. కల్కి, రాయన్, తుఫాన్ సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరో రెండు సినిమాలు కూడా తెలుగులో ఇతర ఓటీటీల్లోకి వచ్చాయి. ఈ వారం తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన ముఖ్యమైన ఐదు సినిమాలు ఇవే.

కల్కి 2898 ఏడీ

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఆగస్టు 22వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జూన్ 27న థియేటర్లలో రిలీజైన కల్కి 2898 ఏడీ రూ.1100కోట్లకుపైగా కలెక్షన్లతో బంపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ కూడా మెయిన్ రోల్స్ చేశారు.

రాయన్

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన రాయన్ సినిమా ఆగస్టు 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ధనుష్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన రాయన్ జూలై 26న థియేటర్ల విడుదలైంది. సుమారు రూ.175కోట్ల కలెక్షన్లు దక్కించుకొని బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేయవచ్చు.

విరాజి

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా విరాజి.. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 22న స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. 20 రోజుల్లోనే ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టేసింది. విరాజి చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు.

గర్ర్

కుంచాకో బోబన్, సూరజ్ వెంజరమూదు ప్రధాన పాత్రలు పోషించిన గర్ర్ సినిమా ఆగస్టు 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. మలయాళం, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. సర్వైవర్ కామెడీ మూవీ గర్ర్ మలయాళంలో థియేటర్లలో జూన్ 14న విడుదలైంది. జై కే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో వీక్షించొచ్చు.

తుఫాన్

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్ర పోషించిన తుఫాన్ సినిమా ఆగస్టు 23న అమెజా్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళ మూవీ మళై పిడిక్కత మణితాన్‍కు తెలుగు వెర్షన్‍గా తుఫాన్ పేరుతో వచ్చింది. ఆగస్టు 9న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. నెల ముగియకుండానే తుఫాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.