OTT Romantic Drama: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన శోభితా ధూళిపాళ్ల రొమాంటిక్ డ్రామా.. ఇక్కడ చూసేయండి
OTT Romantic Drama: ఓటీటీలోకి శోభితా ధూళిపాళ్ల నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. మూడు వారాల కిందట హిందీలో ఓటీటీలోకి అడుగు పెట్టిన ఈ మూవీని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసిన తీసుకు వచ్చారు.
OTT Romantic Drama: శోభితా ధూళిపాళ్ల నటించిన లవ్, సితార మూవీ ఇప్పుడు తెలుగులోనూ చూసేయొచ్చు. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత నటించిన మూవీ కావడంతో దీనిపై రిలీజ్ కు ముందు నుంచే ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 27న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమాను తెలుగులో డబ్ చేయడం విశేషం.
లవ్, సితార తెలుగులో..
నాగ చైతన్య కాబోయే భార్య శోభితా ధూళిపాళ్ల నటించిన మూవీ లవ్, సితార. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడీ సినిమాను తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 18) జీ5 తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"డ్రామా, లవ్, కుటుంబ బంధాల కథ.. ఇప్పుడు తెలుగులోనూ.. లవ్, సితారను తెలుగులో జీ5లో చూడండి" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా లవ్ సితార తెలుగు టైటిల్ తో ఉన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
లవ్, సితార ఎలా ఉందంటే?
లవ్, సితార మూవీకి మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఈ కాలంలోని రిలేషన్షిప్స్, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు, జీర్ణించుకోలేని నిజాలు బయటకు వచ్చినప్పుడు వ్యక్తులు స్పందిస్తున్న తీరు.. ఇలా వివిధ భావోద్వేగాల చుట్టూ తిరిగే మూవీ లవ్, సితార. ఇందులో సితార పాత్రలో శోభిత నటించింది. ఆమెతోపాటు రాజీవ్ సిద్ధార్థ, సోనాలీ కులకర్ణి, జయశ్రీలాంటి వాళ్లు నటించారు.
ఓ పంజాబీ చెఫ్ అయిన వ్యక్తి మలయాళీ ఇంటీరియర్ డిజైనర్ అయిన అమ్మాయి మధ్య కలిగే ప్రేమ, పెళ్లి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఓ నిజం అతని దగ్గర దాచి పెట్టి సితార పెళ్లికి సిద్ధమవడం, తర్వాత పెళ్లి కోసం కేరళలోని తన సొంతూరికి వెళ్లిన తర్వాత తన కుటుంబానికి చెందిన మరిన్ని సీక్రెట్స్ బయటపడటంలాంటివి స్టోరీలో చూడొచ్చు.
ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి. శోభిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా అంతగా నచ్చలేదు. ఈ సినిమాను ట్రైలర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఐఎండీబీలో సినిమాకు 5.6 రేటింగ్ మాత్రమే ఉంది.