Jio Star OTT: ఓటీటీలో నయా సంచలనం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఆధిపత్యానికి గండికొట్టేలా ‘జియో స్టార్’ తెరపైకి!
Jio, Disney+ Hostar merge: భారీ బడ్జెట్ సినిమా ఏదీ వస్తున్నా.. ఓటీటీ రైట్స్ కోసం తొలుత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్యే గత కొంతకాలంగా పోటీ కనిపిస్తోంది. ఓటీటీలో జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ ఉన్నా.. వెనకబడిపోయాయి.
ఓటీటీలో బిగ్ డీల్ తెరపైకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఓటీటీల్లో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా కాస్త వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. దాంతో ఈ రెండూ కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘జియో స్టార్’ పేరుతో వచ్చేందుకు డీల్ కుదిరింది. ఈ మేరకు కొత్త డొమైన్ కూడా నవంబరు 14 నుంచి ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది.
వాస్తవానికి డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా విలీనం గురించి ఈ ఏడాది ఆరంభం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర, అనుభవం ఉన్న హాట్‌స్టార్‌కి మంచి టెక్నాలజి అందుబాటులో ఉంది.
ఆ రెండు ఓటీటీల ఆధిపత్యానికి గండి
జియో సినిమాకి భిన్నమైన భాషల్లో నెట్‌వర్కింగ్‌తో పాటు సాధన సంపత్తి ఉంది. దాంతో ఈ రెండు నెట్‌వర్క్‌ల కలయిక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌కి గట్టి ఎదురుదెబ్బకానుంది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ రెండు ఓటీటీ సంస్థలే ఇప్పటి వరకు ఓటీటీ సినిమాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఎక్కువగా పోటీపడుతున్నాయి. ఇప్పుడు జియో స్టార్ రాకతో ఈ పోటీ మరింత పెరగనుంది. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పాగా వేయాలని ఆశిస్తున్న ముఖేష్ అంబాని ఈ డీల్ వెనుక పెద్ద ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
డీల్‌లో క్రికెట్ మ్యాచ్‌ల్లేవ్
హాట్‌స్టార్, జియో సినిమా ఇప్పటికే క్రికెట్‌కి సంబంధించి గట్టి పోటీదారులు ఉన్నాయి. అయితే.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో మాత్రమే ఈ డీల్ ఉంటుందని.. క్రికెట్, స్పోర్ట్స్ సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ మాత్రం ‘జియో స్టార్’లో ఉండదని తెలుస్తోంది.