OTT Bold Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న మరో బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Bold Movie: ఓటీటీలోకి ఇప్పుడు మరో బోల్డ్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. గే లవ్ స్టోరీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా.. స్ట్రీమింగ్ తేదీని తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 17) రివీల్ చేశారు.
OTT Bold Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎంతో బోల్డ్ కంటెంట్ ఎలాంటి సెన్సార్ లేకుండా నేరుగా వచ్చేస్తోంది. ముఖ్యంగా ఓటీటీలు నిర్మించే ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లలో కంటెంట్ చాలా బోల్డ్ గా ఉంటోంది. ఇప్పుడు అలాంటిదే మరో గే రొమాన్స్ స్టోరీతో ఓ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగు పెడుతోంది. జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ ఓటీటీ
ఈ బోల్డ్ మూవీ పేరు అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ. ఇదొక గే లవ్ స్టోరీ. అమర్, ప్రేమ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య సాగే ప్రేమ కథ. ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ మంగళవారం (సెప్టెంబర్ 17) తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"వీళ్ల జోడీ అద్వితీయమైనది. అమర్, ప్రేమ్ వాళ్ల కథ చెప్పడానికి వస్తున్నారు. అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ అక్టోబర్ 4 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఈ సినిమాలో ఆదిత్య సీల్, దీక్షా సింగ్, సన్నీ సింగ్ లాంటి వాళ్లు నటించారు. హార్దిక్ గజ్జర్ డైరెక్ట్ చేశాడు.
గే రొమాన్స్ కాన్సెప్ట్‌తో..
ఇండియాలో ఆర్టికల్ 377 ఎత్తేసిన తర్వాత గే రొమాన్స్ కు సంబంధించిన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో తరచూ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఓటీటీల్లో చాలా ఎక్కువగానే ఉంది. అయితే చాలా వరకు సినిమాలు, సిరీస్ లలో ఒక భాగంగా ఇది కనిపించింది. కానీ తొలిసారి ఓ హిందీ సినిమాలో గే రొమాన్సే ప్రధానంగా ఓ మూవీ తెరకెక్కడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.
అమర్, ప్రేమ్ అనే ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథే ఈ అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ. ఈ సినిమా గురించి జియో సినిమా ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. అయితే ఇలాంటి బోల్డ్ మూవీలో నటించడంపై గతంలో ఆదిత్య సీల్ స్పందించాడు. తొలిసారి ఓ అబ్బాయితో స్క్రీన్ పై రొమాన్స్ చేయడంపై అతడు మాట్లాడాడు.
"పదేళ్ల కిందట ఈ విషయంపై నా ఆలోచనలు పూర్తి వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు నేను ఎదిగాను. ఎంతో మంది గే మగాళ్లు, ఆడవాళ్లను నేను కలిశాను. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉండటాన్ని నేను అలాగే చూస్తాను. అందులో వాళ్ల జాతి, కులం, మతం, రంగు, జెండర్ చూడాల్సిన అవసరం లేదు. అందుకే స్క్రీన్ పై ఓ అమ్మాయితో రొమాన్స్ చేయడం ఎలాంటిదో అబ్బాయితో చేయడం కూడా అలాంటిదే" అని ఆదిత్య అన్నాడు.