SS Rajamouli: “మహేశ్ బాబుతో అలాంటి మూవీ తీస్తున్నా”: అంచనాలను మరింత పెంచేసిన రాజమౌళి
SS Rajamouli - Mahesh Babu: మహేశ్ బాబుతో తాను తదుపరి రూపొందించే చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించాడు స్టార్ దర్శకుడు రాజమౌళి. దీంతో ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేశాడు.
SS Rajamouli - Mahesh Babu: బాహుబలి సినిమాలతో భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. హాలీవుడ్ మేటి దర్శకులు, ప్రముఖ నటుల ప్రశంసలను పొందాడు. దీంతో దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం కోసం భారత్‍తో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తన తదుపరి చిత్రం చేయనున్నాడు రాజమౌళి. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు రాజమౌళి.
మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం (SSMB29) అడ్వెంచర్ యాక్షన్ జానర్‌లో ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్‍లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఆ మూవీ ఉంటుందని తెలిపాడు. మహేశ్‍తో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి ఎలాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు. వివరాలివే..
“ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి గ్లోబల్ సినిమాలు తీయాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అడ్వెంచరస్ జానర్‌లో ప్రస్తుతం మా నాన్న ఓ సినిమా రాస్తున్నారు. స్క్రిప్ట్‌ను మేం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి” అని రాజమౌళి అన్నాడు. “నా తర్వాతి మూవీ మహేశ్ బాబుతో చేస్తున్నా. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. భారతీయ మూలాలతో.. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్‍ను పోలిన మూవీగా ఉంటుంది” అని రాజమౌళి చెప్పాడు. రాజమౌళి - మహేశ్ బాబు మూవీ వర్కింగ్ టైటిల్ SSMB29గా ఉంది. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎస్ఎస్ఎంబీ29 గురించి ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. మహేశ్‍తో మూవీని గ్లోబల్ ఫ్రాంచైజీగా చేయాలన్న ఆలోచన కూడా తమకు ఉందని చెప్పారు. “ఇండియానా జోన్స్ సిరీస్ లైన్‍లానే ఇది ఉంటుంది. చాలా ఎమోషన్స్ ఉండే అడ్వెచర్ యాక్షన్ డ్రామా ఇది. లాస్ట్ ఆర్క్ లా ఉంటుంది. నేను జూలై కల్లా స్క్రిప్ట్ పూర్తి చేస్తా. ఆ తర్వాత నేను నా కుమారుడికి (రాజమౌళి) ఇస్తా. మేం దీన్ని ఫ్రాంచైజీగా తీద్దాం అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం? మేం ఈ సినిమాకు ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ ఇస్తాం. ఆ తర్వాత సీక్వెల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం” అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. కాగా, వివిధ హీరోలతో ఈ ఫ్రాంచైజీలో మూవీలను రూపొందించాలని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా ఇండియాలో థియేటర్లలో జూన్ 29న విడుదల కానుంది. అమెరికాలో ఓ రోజు ఆలస్యంగా విడుదవుతుంది. ఇండియాలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రం రిలీజ్ కానుంది.