GDP base year: జీడీపీ బేస్ ఇయర్ ను మారుస్తున్న కేంద్రం; జీడీపీ బేస్ ఈయర్ అంటే ఏమిటి?
GDP base year: భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ని లెక్కించేందుకు ఉద్దేశించిన బేస్ ఇయర్ ను అప్ డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు జీడీపీ బేస్ ఈయర్ గా 2011 - 12 ఉంది. ఇకపై ఆ సంవత్సరాన్ని కాకుండా, కేంద్రం నోటిఫై చేసిన మరో సంవత్సరాన్ని బేస్ ఈయర్ గా తీసుకోనున్నారు.
GDP base year: భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ని లెక్కించడానికి బేస్ ఇయర్ ను అప్ డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 2011-12 నుంచి 2022-23 వరకు బేస్ ఇయర్ ను అప్డేట్ చేస్తున్నామని, అందుకు గానూ, కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI), అకడమిక్ నిపుణులతో నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ (ఏసీఎన్ఏఎస్) అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తన సమాధానంలో తెలిపారు.
జీడీపీ బేస్ ఈయర్ అంటే ఏమిటి?
ఆర్థిక సూచికలు, ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి, ఆర్థికవేత్తలు వృద్ధిలో మార్పులను ట్రాక్ చేయడానికి ఒక బేస్ ఇయర్ ను నిర్ణయిస్తారు. దీనిలో అన్ని విలువలు స్థిరంగా ఉంటాయి. బేస్ ఇయర్ అనేది రిఫరెన్స్ ఇయర్. దీనితోనే మిగతా అన్ని సంవత్సరాల అన్ని విలువలను పోలుస్తారు. ఇది ఆర్థిక వృద్ధిని అంచనా వేసే విధానంలో కీలకమైన ప్రక్రియ. 2025 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్టానికి పడిపోయిందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గత నెలలో విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
తగ్గిన జీడీపీ
వినియోగ డిమాండ్ మందగించడం, మైనింగ్ రంగం బలహీనపడటంతో రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 5.4 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 6.8 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 22 మంది సభ్యుల ప్యానెల్ ప్రస్తుతం ఉత్పత్తిదారుల ధరలను ట్రాక్ చేసే టోకు ధరల సూచీతో సహా వివిధ ధరల సూచీలకు కొత్త బేస్ ఇయర్ ను తీసుకురావడానికి పనిచేస్తోంది.
ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు కూడా..
అధికారిక ఉపాధి, నిరుద్యోగ గణాంకాలను అందించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)ను కూడా ప్రస్తుతం నిర్వహించే దానికంటే ఎక్కువగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గత నెలలో హెచ్టీకి తెలిపారు. డైనమిక్ గా మారుతున్న డేటా అవసరాలను తీర్చడానికి నాణ్యమైన డేటా (data) లభ్యత కోసం మంత్రిత్వ శాఖ సంస్కరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య గణాంక సమన్వయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పీఎల్ఎఫ్ఎస్ వంటి సర్వేల ఫ్రీక్వెన్సీని పెంచే ప్రణాళికలు ఉన్నాయి' అని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) కార్యదర్శి సౌరభ్ గార్గ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర గణాంక సంస్థల 28వ సదస్సులో గార్గ్ ప్రసంగించారు.