Hi Nanna: హాయ్ నాన్న కోసం 15 మంది మ్యూజిషియన్స్.. 40 రోజులపాటు అక్కడే! ఆసక్తికర విషయాలు
Hesham Abdul Wahab About Hi Nanna: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హాయ్ నాన్నకు మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో హాయ్ నాన్న సినిమాపై ఆసక్తికర విశేషాలు చెప్పారు హేషమ్ అబ్దుల్.
Hesham Abdul Wahab Latest Interview: నేచురల్ స్టార్ నాని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా 'హాయ్ నాన్న'. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. అలాగే హృదయం, ఖుషి వంటి సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ హాయ్ నాన్నకు సంగీతం అందించారు. డిసెంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
తెలుగులో మొదటి చిత్రంతోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఆదరణ ఎలా అనిపిస్తోంది?
చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా ఒక పరీక్షే. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. ఇంకా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేయాలి. హాయ్ నాన్న చిత్రం నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవడానికి తోడ్పడింది.
లవ్, రొమాన్స్, డ్రామాలోనే కొత్తదనం చూపించడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారు ?
ఇది కేవలం సంగీత దర్శకుడే కాదు. దర్శకుడు, రచయిత, ఎడిటర్.. అలా అందరూ కొత్తదనం ఎలా చూపించాలనే విషయంపైనే దృష్టి పెడతారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా ఉంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్లీ కలవడం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్ గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి ఉంటుంది. సంగీతం కూడా అలానే ఉంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్ గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది.
దర్శన, సమయమా.. ఈ రెండు పాటలకు చాలా మంది పోలికలు తీసుకొస్తున్నారు.. దీని గురించి?
ఈ పోలిక తీసుకురావడం సహజమే. ఎందుకంటే దర్శన, సమయమా.. ఈ రెండు పాటల మొదటి నోట్ ఒకేలా ఉంటుంది. కానీ, దర్శన కంటే క్లాసిక్ కంపోజిషన్ సమయమాలో వినిపిస్తుంది. అయితే ఆడియన్స్ చాలా తెలివిగా, అప్డేట్ గా ఉంటారు. దర్శనతో పోలిక పెట్టడం ఆనందమే. రెండు పాటలు వైరల్ అయ్యాయి (నవ్వుతూ).
నిరంతరం కొత్త ట్యూన్స్ ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రతలు తీసుకుంటారు ?
నా వరకూ దర్శకుడు విజన్ ని ఫాలో అవుతాను. ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్ కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. హాయ్ నాన్న వెరీ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్ గా చేశాం. మీరు బాగా పరిశీలిస్తే హాయ్ నాన్న లో లైటింగ్ విజువల్స్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతని ఇచ్చేలా ఉంటాయి.
వైర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ గురించి ?
వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమా కోసం 15 మంది మ్యుజిషియన్స్ దాదాపు 40 రోజులు హైదరాబాద్ లో పని చేశాం. మరో 20 మందికి పైగా ప్లేయర్స్ రికార్డింగ్స్ లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. మ్యూజిక్ అంతా హైదరాబాద్ లోనే చేశాం.
దర్శన, ఖుషి, సమయమా, అమ్మాడి.. ఇలా మీ పాటల్లో ఒక పదంతో హుక్ చేసే స్వభావం కనిపిస్తుంది.. దీని గురించి చెప్పండి?
సహజంగానే ఒక పదంతో పాటలోకి వెళ్లడం నాకు ఇష్టం. ఇందులో అమ్మాడి పాట చేసినప్పుడు కూడా ముందు.. ఆ పదంపైనే దృష్టి పెట్టాను. లిరిక్స్ రైటర్స్ కి ప్రత్యేకంగా అడిగాను. అలాగే గాజుబొమ్మ, సమయమా పాటలు కూడా పదాలతోనే ముందుగా హత్తుకుంటాయి. అందరికి తెలిసిన, సహజంగా వాడుకలో ఉన్న, ఇలాంటి పదాలతో ఉన్న పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయని భావిస్తాను.
ఈ మధ్య కాలంలో పాటల్లో చరణాలు ఉండటం లేదు కదా.. దీనిపై మీ అభిప్రాయం ?
ఇది పూర్తిగా దర్శకుడు చేతిలో ఉంటుంది. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలంటే.. లాస్ట్ వీక్ వర్క్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ సినిమా హ్యంగోవర్ లోనే ఉన్నాను. దర్శకుడు శౌర్యువ్ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యాను. పల్లవి ఒక చోట, చరణం మనకు సర్ ప్రైజ్ ఇచ్చేలా మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు. సమయమా పాట శైలి చాలా భిన్నంగా ఉంటుంది. గాజు బొమ్మ పాటలో రెండు చరణాలు ఉంటాయి. శౌర్యువ్ రెండు ఫార్మెట్స్ ని చాలా చక్కగా చూపించారు. ఇందులో ప్రతి పాటకు ప్రాముఖ్యత ఉంటుంది. మ్యూజిక్ పరంగా అందుబాటులో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ని యూజ్ చేశాం.
ఓడియమ్మ పాట గురించి చెప్పండి ?
కథలో ఒక పెద్ద పార్టీ సాంగ్ ఉంది. ఆ విజువల్స్ మ్యాచ్ చేసే ఎనర్జిటిక్ నెంబర్ కావాలి. ఆ ఎనర్జీని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక ట్యూన్ రికార్డ్ చేసి శౌర్యువ్ కి సెండ్ చేశాను. అది ఆయనకి చాలా నచ్చింది. మనకి కావాల్సిన ఎనర్జీ ఇదే అన్నారు. ఈ పాటని ద్రువ్ తో పాడించాలానే ఆలోచన శౌర్యవ్ దే. అలాగే శ్రుతి హసన్ గారు కూడా అద్భుతంగా పాడారు.
కొత్తగా చేస్తున్న చిత్రాలు?
శర్వానంద్ గారు, శ్రీరాం ఆదిత్య సినిమాకి చేస్తున్నాను. అలాగే రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పని చేస్తున్నాను.