Mukhachitram Movie Review: ముఖచిత్రం మూవీ రివ్యూ - విశ్వక్‌సేన్ గెస్ట్ రోల్‌లో నటించిన సినిమా ఎలా ఉందంటే
Mukhachitram Movie Review: వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ముఖచిత్రం సినిమా ఈ శుక్రవారం (నేడు)ప్రేక్షకుల ముందుకొచ్చింది. గంగాధర్ దర్శకత్వం వహించాడు.
Mukhachitram Movie Review: కలర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నాడు దర్శకుడు సందీప్‌రాజ్ (Sandeep raj). అతడు కథ, స్క్రీన్‌ప్లేను అందించిన తాజా చిత్రం ముఖచిత్రం. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని(Priya Vadlamani), చైతన్యరావ్, అయేషాఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గంగాధర్ దర్శకత్వం వహించాడు. ప్లాస్టిక్ సర్జరీ కారణంగా ముఖం మారిపోవడం అనే కాన్సెప్ట్‌తో ప్రచార చిత్రాలతో ఈ చిన్న సినిమా ఆసక్తిని రేకెత్తించింది. యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Viswak sen) ఇందులో అతిథి పాత్రలో నటించడంతో ఈ ఇంట్రెస్ట్ కాస్త రెట్టింపైంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ముఖచిత్రం డిసెంబర్ 9న (నేడు) విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
Mukhachitram story -ట్రాయంగిల్ లవ్ స్టోరీ...
రాజ్‌కుమార్ (వికాస్ వశిష్ట) ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. తొలిచూపులనే మహతి (ప్రియా వడ్లమాని) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. రాజ్‌ను చిన్ననాటి స్నేహితురాలు మాయ ఫెర్నాండేజ్ (అయేషాఖాన్) ఇష్టపడుతుంటుంది. కానీ మాయ ప్రేమను కాదని మహతితోనే కొత్త జీవితం మొదలుపెడతాడు రాజ్.
అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌లో మాయ తీవ్రంగా గాయపడుతుంది. అదే రోజు మహతి కూడా ఓ ప్రమాదంలో చనిపోతుంది. దాంతో చనిపోయిన మహతి ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మాయకు అమర్చుతాడు రాజ్. మహతి చనిపోలేదని ఆమె తల్లిదండ్రులతో పాటు ప్రపంచాన్ని నమ్మిస్తాడు. రాజ్ ఆ పని ఎందుకు చేశాడు? మహతి చావుకు కారణం ఎవరు? మహతి మరణం వెనకున్న నిజాలను మాయ ఎలా తెలుసుకుంది? రాజ్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి ఏ విధంగా చాటిచెప్పింది? మాయ పోరాటంలో ఆమెకు అండగా నిలబడిన విశ్వామిత్ర (విశ్వక్‌సేన్) ఎవరన్నదే ఈ సినిమా కథ.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో
భర్తను హతమార్చి అతడి స్థానంలో ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తీసుకువచ్చిన ఓ మహిళ ఉదంతం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ ఇన్సిడెంట్ తో పాటుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు నుంచి స్ఫూర్తి పొందుతూ ముఖచిత్రం కథను రాసుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్.
సెక్సువల్ రిలేషన్స్ విషయంలో సమాజంలో ఉన్న అపోహలు, భార్యలను బానిసలుగా చూసే భర్తల కారణంగా వారు ఎదుర్కొనే ఇబ్బందులను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. సెన్సిటివ్ ఈష్యూను ఎమోషన్స్, థ్రిల్ కలగలుపుతూ చెప్పడం బాగుంది . ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అమ్మాయి ముఖం మారిపోవడం, ఆ తర్వాత మహతి జీవితంలో జరిగిన విషాదాన్ని మాయ తెలుసుకోవడం లాంటి అంశాలను ఆసక్తికరంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు.
క్లైమాక్స్ డైలాగ్స్...
ఫస్ట్ హాఫ్ మహతి జీవితంలోకి రాజ్ రావడం, మధ్యలో మాయ వన్ సైడ్ లవ్‌తో సినిమా ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా సాఫీగా సాగుతుంది. ఒకేరోజు మహతి, మాయ ప్రమాదాలకు గురికావడం, మహతి ఫేస్‌ను మాయకు అమర్చడం లాంటి సీన్స్‌తో సెకండాఫ్‌లో ఏదో జరుగబోతుందని హింట్ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్.
ఆ తర్వాత మహతి జీవితంలో జరిగిన ఒక్కో విషాదాన్ని మాయ ఛేదిస్తూ వెళ్లడం, ఆమెకు న్యాయం చేయడానికి జరిపే పోరాటాన్నిఉద్వేగభరితంగా చూపించారు. క్లైమాక్స్ కోర్ట్ ఎపిసోడ్స్‌లోని సంభాషణలు ఆకట్టుకుంటాయి. చనిపోయిన మహతితో లాయర్ క్యారెక్టర్‌కు రిలేషన్ షిప్ ఉన్నట్లుగా చూపించడం లాజికల్‌గా బాగుంది.
ప్రియా వడ్లమాని కెరీర్ బెస్ట్...
ఇదివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన ప్రియా వడ్లమానికి యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ దొరికింది. ఫస్ట్ హాఫ్‌లో అమాయకమైన అమ్మాయిగా, సెకండాఫ్‌లో ఆధునిక యువతిగా రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ చక్కటి నటనను కనబరిచింది.
రాజ్‌కుమార్‌గా వికాస్ వశిష్ట పాజిటివ్ యాంగిల్‌లో కనిపించే నెగెటివ్ రోల్‌లో ఒదిగిపోయాడు. అతడి డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. హీరో ఫ్రెండ్‌గా చైతన్యరావ్‌కు మంచి క్యారెక్టర్ దక్కింది. అయేషాఖాన్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో లాయర్‌గా గెస్ట్ రోల్‌లో విశ్వక్‌సేన్ నటించాడు. లాయర్ క్యారెక్టర్ అతడికి పెద్దగా సెట్ కాలేదు. అతడి డైలాగ్స్‌లో డెప్త్, సీరియస్‌నెస్ మిస్సయ్యాయి. కాలభైరవ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది.
Mukhachitram Movie Review -కొత్తదనం మిస్
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన విభిన్నమైన ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ముఖచిత్రం సినిమాను చెప్పవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ తప్ప మిగిలిన వాటిలో కొత్తదనం కొంత వరకు మిస్సయింది.
రేటింగ్: 2.5/5