Mr Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ - బాలీవుడ్ రీమేక్‌తో రవితేజ హిట్ కొట్టాడా? లేదా?
Mr Bachchan Review: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ గురువారంథియేటర్లలో రిలీజైంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ మిస్టర్ బచ్చన్. హిందీలో విజయవంతమైన రైడ్ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రైడ్ ఎలా ఉంది? రీమేక్ కథతో రవితేజ హిట్ కొట్టాడా లేదా అంటే?
మిస్టర్ బచ్చన్ కథ...
మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీపరుడైన ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అతడి కెరీర్‌లో ప్రమోషన్స్ కంటే సస్పెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓ పొలిటికల్ లీడర్‌పై జరిపిన రైడ్ కారణంగా సస్పెండ్ కావడంతో సొంతూరు కోటిపల్లి వచ్చేస్తాడు. స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా నిర్వహిస్తుంటాడు. అలాంటి టైమ్‌లోనే బచ్చన్ లైఫ్‌లోకి జిక్కి (భాగ్యశ్రీ బోర్సే) వస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వారి పెళ్లికి జిక్కి తల్లిదండ్రులు అడ్డుచెబుతారు.
మరోవైపు బచ్చన్‌పై సస్పెన్సన్ ఎత్తేస్తారు. ఎంపీ ముత్యాల జగ్గయ్యపై (జగపతిబాబు) రైడ్ చేయాలని బచ్చన్‌కు ఆర్డర్స్ వస్తాయి. ఆ రైడ్‌లో ఏం జరిగింది? బచ్చన్‌కు తన ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు దొరక్కుండా జగ్గయ్య ఏం చేశాడు? ఈ రైడ్‌ను ఆపించేందుకు జగ్గయ్య చేసిన ప్రయత్నాలను బచ్చన్ ఎలా తిప్పికొట్టాడు? జగ్గయ్యకు, బచ్చన్‌కు పాత గొడవలు ఉన్నాయా? బచ్చన్, జిక్కి పెళ్లికి పెద్దలు ఎందుకు అడ్డు చెప్పారు అన్నదే మిస్టర్ బచ్చన్ మూవీ కథ.
రైడ్ రీమేక్...
మిస్టర్ బచ్చన్ బాలీవుడ్‌లో విజయవంతమైన రైడ్ సినిమాకు రీమేక్. హిందీ రైడ్ మూవీ కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి లవ్ స్టోరీలు ఉండవు. సినిమా కథ చాలా వరకు ఒకే ఇంట్లో, సీరియస్ కోణంలో సాగుతుంది. ఇలాంటి కథను రీమేక్ చేయాలంటే చాలా ధైర్యమే కావాలి. మిస్టర్ బచ్చన్‌తో హరీష్ శంకర్ ఆ సాహసానికి సిద్ధపడ్డాడు.
నో లాజిక్స్ ఓన్లీ ఫన్...
రైడ్‌లోని మూలకథను తీసుకొని తనదైన స్టైల్ ట్రీట్‌మెంట్‌తో రవితేజ అభిమానులను మెప్పించేలా మిస్టర్ బచ్చన్ మూవీని రూపొందించాడు. కామెడీ, రొమాన్స్, లవ్ ట్రాక్ లను జోడించి ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా మూవీని మలిచాడు. రవితేజను నిజాయితీపరుడైన ఐటీ అధికారిగా చూపిస్తూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి.
ఆ తర్వాత సస్పెన్షన్‌కు గురై సొంతూరు వెళ్లిన తర్వాత వచ్చే సీన్స్ నుంచి కథ కామెడీ వైపుకు టర్న్ తీసుకుంటుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, వారి కెమిస్ట్రీని యూత్ ఆడియెన్స్ మెప్పించేలా రాసుకున్నారు. పాత కాలం నాటి హిందీ పాటలతో సరదాగా ప్రేమకథను నడిపించారు. ఆ సీన్స్ మొత్తం టైమ్‌పాస్ చేస్తాయి. కామెడీ టైమింగ్‌లో వింటేజ్ రవితేజను గుర్తుచేశాడు హరీష్ శంకర్.
రైడింగ్ సీన్స్...
మిస్టర్ బచ్చన్ అసలు కథ మొత్తం సెకండాఫ్‌లోనే నడిపించాడు డైరెక్టర్. ఇంటర్వెల్ కు ముందు విలన్ పాత్రను పరిచయం చేయడం, అతడిపై హీరో రైడ్‌కు వెళ్లబోతున్నట్లు చూపించి ద్వితీయార్థం కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు. హీరోకు తన ఇంట్లో ఏం దొరక్కుండా విలన్ వేసిన ప్లాన్స్, బచ్చన్ తన తెలివితేటలతో వాటిని బయటపెట్టే సీన్స్...ఇలా ఒకరిపై మరొకరు వేసే ఎత్తులతో ఈ సీన్స్ సాగుతాయి.
విలన్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన క్లైమాక్స్‌లో హీరో విన్నర్ కావడం అన్నది తెలుగు సినిమాల్లో కామన్‌గా కనిపిస్తుంది. ఈ మూవీ కూడా అదే ఫార్ములాలో ఎండ్ అవుతుంది. చివరలో ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో సిద్ధు జొన్నలగడ్డను చూపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. అతడి గెస్ట్ అప్పిరియనెన్స్‌ను బాగా వాడుకున్నాడు దర్శకుడు.
మార్పులు బెడిసికొట్టాయి...
మిస్టర్ బచ్చన్ మూవీలో కమర్షియాలిటీ కోసం దర్శకుడు చేసిన మార్పుల్లో కొన్ని బెడిసికొట్టినట్లుగా అనిపిస్తాయి. సీరియస్‌గా కథను నడిపించాల్సిన చోట కామెడీని ఇరికించి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని డైరెక్టర్ అనుకోవడం అంతగా ఆకట్టుకోడు. కీలకమైన చమ్మక్ చంద్ర ట్రాక్ నవ్వించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ కథకు సంబంధం లేకుండా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీలో హిందీ పాటలు ఎక్కువ కావడం మరో డ్రాబ్యాక్‌గా నిలిచింది.
కామెడీ టైమింగ్ అదుర్స్...
బచ్చన్ పాత్రలో రవితేజ తనదైన మార్కు ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఒరిజినల్‌లో అజయ్ దేవ్‌గన్ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేకుండా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. యాక్టింగ్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది.
విలన్‌గా జగపతిబాబు ఓకే అనిపించాడు. తనకు అలవాటైన పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. సత్య, సత్యంరాజేష్, గిరిధర్, చమ్మక్ చంద్ర ...సినిమాలో చాలా మందే కమెడియన్లు ఉన్నారు. కొన్ని క్యారెక్టర్లు నవ్వించగా...మరికొన్ని తేలిపోయాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్సయింది. పాటలు బాగున్నాయి.
రవితేజ ఫ్యాన్స్‌కు ట్రీట్
మిస్టర్ బచ్చన్ రవితేజ అభిమానులను వందశాతం మెప్పిస్తుంది. లాజికల్‌లతో సంబంధం లేకుండా కమర్షియల్‌సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌కు ఫుల్ టైమ్‌పాస్‌లా మూవీ ఉంటుంది.
రేటింగ్: 2.5/5