Most Watched TV Show: ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో ఇదే.. మన రామాయణ, మహాభారతాల కంటే చాలా ఎక్కువ
Most Watched TV Show: ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో ఏదో తెలుసా? ఈ షోకి మన రామాయణ, మహాభారతాల కంటే ఎంతో ఎక్కువ వ్యూయర్‌షిప్ రావడం విశేషం.
Most Watched TV Show: టీవీ సీరియల్స్, షోలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ, ఎప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా మన దేశంలోనూ ఈ టీవీ షోలకు ఫాలోయింగ్ పెరిగింది. మూడున్నర దశాబ్దాల కిందట దూరదర్శన్ లో వచ్చిన రామాయణం, మహాభారత షోలను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. మరి ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో గురించి మీకు తెలుసా?
ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో ఇదే
ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన షో బేవాచ్ (Baywatch). ఈ అమెరికన్ టీవీ షో 1996లోనే వారానికి 100 కోట్లకుపైగా ప్రేక్షకులు చూశారంటే నమ్మశక్యం కాదు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ బేవాచ్ షోకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. మూడు దశాబ్దాలుగా ఈ షో క్రియేట్ చేసిన రికార్డుకు దరిదాపుల్లోకి కూడా మరే షో వెళ్లలేదు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల ప్రకారం.. ఈ బేవాచ్ షో పాపులారిటీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వారంలో గరిష్ఠంగా 110 కోట్ల మంది ప్రేక్షకులు చూశారట. లాస్ ఏంజిల్స్ లోని బీచ్ లలో ఉండే కొందరు లైఫ్ గార్డ్స్ జీవితాల చుట్టూ తిరిగే కథే ఈ బేవాచ్. ఈ షోకి ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. 1990ల్లో అప్పటి యువత ఈ షోని మిస్ కాకుండా చూసేవాళ్లు.
ఏకంగా 148 దేశాల్లో 44 భాషల్లో ఈ బేవాచ్ షో టెలికాస్ట్ కావడం విశేషం. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఒక్క అంటార్కిటికాను మినహాయించి మిగిలిన ఆరు ఖండాల్లోనూ ప్రతి మూలలో ఈ షో టెలికాస్ట్ అయినట్లు గిన్నిస్ బుక్ వెల్లడించింది. 1996లో నమోదైన ఈ రికార్డుకు 28 ఏళ్లుగా ఏ ఇతర టీవీ షో దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.
బేవాచ్ పాపులారిటీ ఇదీ
ఇండియాలో ఒకప్పుడు టీవీలను ఊపేసిన షోలుగా రామాయణం, మహాభారతం నిలిచాయి. ఈ ఇతిహాసాలను చూడటానికి ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. అయితే ఈ రెండు సీరియల్స్ ను కలిపినా వారానికి గరిష్ఠంగా 16 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు. ఆ లెక్కన బేవాచ్ ను వీటి కంటే సుమారు ఏడెనిమిది రెట్లు ఎక్కువ ప్రేక్షకులు చూశారు.
ఇండియన్ షోలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మెచ్చిన షోలైన ఫ్రెండ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటివి కూడా ఈ బేవాచ్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం రేపిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కూడా గరిష్ఠంగా 50 కోట్ల మంది ప్రేక్షకుల మార్క్ నే టచ్ చేయగలిగింది. దీనిని బట్టి బేవాచ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పమేలా ఆండర్సన్, అలెగ్జాండ్రా పాల్, గ్రెగొరి అలన్ విలియమ్స్, జెరెమీ జాక్సన్, పార్కర్ స్టీవెన్సన్ లాంటి నటీనటులు ఈ బేవాచ్ లో నటించారు. 1989 నుంచి 2001 మధ్య 11 సీజన్ల పాటు ఈ బేవాచ్ సిరీస్ కొనసాగింది. ఇక దీని ఆధారంగానే 2017లో హాలీవుడ్ లో బేవాచ్ అనే మూవీ కూడా రూపొందింది. ఇందులో ప్రియాంకా చోప్రా కూడా నటించింది.