Michael Jackson Biopic: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్.. అచ్చూ పాప్ కింగ్‌లాగే అతని అల్లుడు..
Michael Jackson Biopic: పాప్ కింగ్ గా పేరుగాంచిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. అతని అల్లుడు జాఫర్ జాక్సన్ అచ్చూ తన మామలాగే కనిపిస్తున్నాడు.
Michael Jackson Biopic: కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ గా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమాలో అతని పాత్రను అల్లుడు జాఫర్ జాక్సన్ పోషిస్తుండటం విశేషం. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ లో ఆ మైఖేల్ జాక్సనే తిరిగి వచ్చాడా అన్నట్లుగా జాఫర్ కనిపిస్తుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మైఖేల్ జాక్సన్ బయోపిక్
మైఖేల్ జాక్సన్ గురించి తెలియని మ్యూజిక్ లవర్ ఉండరు. పాప్ మ్యూజిక్ అనే కాదు.. సింగర్, డ్యాన్సర్, సాంగ్ రైటర్ గా కూడా అతడు పేరుగాంచాడు. ఎప్పుడో 15 ఏళ్ల కిందట కన్నుమూసిన ఈ కింగ్ ఆఫ్ పాప్ బయోపిక్ ఇప్పుడు తెరకెక్కుతోంది. మైఖేల్ పేరుతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 13) ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో మైఖేల్ జాక్సన్ పాత్ర పోషిస్తున్న అతని అల్లుడు జాఫర్ జాక్సన్ అచ్చూ అతనిలాగే కనిపిస్తుండటం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. 1990ల్లో మైఖేల్ జాక్సన్ వేసుకునే డ్రెస్సులాంటిదే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో జాఫర్ ధరించాడు. తెల్లటి వీ నెక్ టీషర్ట్ పై బటన్స్ లేకుండా షర్ట్ వేసుకొని, బ్లాక్ ప్యాంట్ లో, పోనీటెయిల్ లో కనిపించాడు.
అచ్చూ మైఖేల్ జాక్సన్ లాగే..
ఈ ఫస్ట్ లుక్ చూసి ఇతడు అచ్చూ మైఖేల్ జాక్సన్ లాగే ఉన్నాడే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "రాబోయే మైఖేల్ బయోపిక్ నుంచి మైఖేల్ జాక్సన్ గా కనిపించనున్న జాఫర్ జాక్సన్ ఫస్ట్ లుక్ ఇది.. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తోంది" అంటూ మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. జాఫర్ లుక్ పై ప్రొడ్యూసర్ గ్రాహమ్ కింగ్ స్పందించాడు.
"జాఫర్ తో ప్రతి లుక్, ప్రతి నోట్, ప్రతి డ్యాన్స్ కదలికి అచ్చూ మైఖేల్ లాగే ఉంటుంది. ఏ ఇతర నటుడికీ సాధ్యం కాని రీతిలో మైఖేల్ పాత్రను అతడు అచ్చు దించేశాడు. ఈ సినిమా కోసం అత్యుత్తమ సాంకేతిక సిబ్బంది మా దగ్గర ఉన్నారు. గతంలో మైఖేల్ జాక్సన్ తో కలిసి పని చేసిన వాళ్లు ఇప్పుడీ సినిమా కోసం మళ్లీ వచ్చారు" అని ప్రొడ్యూసర్ గ్రాహమ్ కింగ్ చెప్పాడు.
మైఖేల్ జాక్సన్ కు కింగ్ ఆఫ్ పాప్ గా పేరుంది. 1958లో జన్మించిన అతడు.. జూన్ 25, 2009లో మరణించాడు. పాప్ మ్యూజిక్ రారాజుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడు రూపొందించిన థ్రిల్లర్, డేంజరస్, ఇన్విన్సిబుల్, ఇమ్మోర్టల్ లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. నాలుగు దశాబ్దాల పాటు మ్యూజిక్, డ్యాన్స్, ఫ్యాషన్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2009లో 51 ఏళ్ల వయసులో అతడు కన్నుమూశాడు.