Michael Jackson biopic: పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ డేట్ ఇదే
Michael Jackson biopic: పాప్ మ్యూజిక్ కింగ్‌గా దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్ వస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Michael Jackson biopic: మైఖేల్ జాక్సన్.. ఈ పేరు వింటేనే కోట్లాది మంది పాప్ మ్యూజిక్ లవర్స్ గుండెలు ఉప్పొంగుతాయి. అలాంటి పాప్ కింగ్ పై ఇప్పుడు ఓ బయోపిక్ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఇక మూవీ ప్రొడక్షన్ పనులు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

గతంలో హాలీవుడ్ లో బోహేమియన్ రాప్సోడీలాంటి సూపర్ హిట్ మూవీ అందించిన గ్రాహమ్ కింగ్ ఈ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. తన మ్యూజిక్, సింగింగ్, అదిరిపోయే డ్యాన్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పాప్ కింగ్ పై బయోపిక్ అంటే సహజంగానే ఎంతో మందిలో ఆసక్తి రేపుతోంది.
మైఖేల్ జాక్సన్ బయోపిక్
లెజెండరీ సింగర్, డ్యాన్సర్ అయిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ లో అతని పాత్రను పోషించేది ఎవరన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. ఈ పాత్రలో అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించనున్నాడు. ఇక ఈ సినిమాను ఆంటోనీ ఫుఖా డైరెక్ట్ చేయనున్నాడు. ఇది కేవలం మైఖేల్ జాక్సన్ బయోపిక్ కాదు.. అతడు తీసుకొచ్చిన కళాత్మక విప్లవాన్ని కళ్లకు కట్టనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మైఖేల్ జాక్సన్ పాప్ సామ్రాజ్యానికి రాజైనా కూడా అతని జీవితంలో వివాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు, చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, డ్రగ్స్ వినియోగం, అప్పులు.. ఇలా అతని చుట్టూ వివాదాలు అనేకం. ఈ నేపథ్యంలో ఈ పాప్ కింగ్ పై సినిమా అంటే ఈ సున్నితమైన అంశాలను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి కూడా నెలకొంది.
అసలు ఈ సినిమాలో చిన్నారులపై లైంగిక వేధింపుల వివాదాన్ని చూపిస్తారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. నిజానికి ఈ ఆరోపణలపై ఏళ్ల పాటు విచారణ జరిగినా.. చివరికి అతడు ఏ తప్పూ చేయలేదని కోర్టు తేల్చింది. ఈ సినిమాను మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ ను మేనేజ్ చేసిన జాన్ బ్రాంకా, జాన్ మెక్‌క్లెయిన్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.
2009, జూన్ 25న 50 ఏళ్ల వయసులో మైఖేల్ జాక్సన్ కన్ను మూశాడు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న తన ఇంట్లో గుండెపోటుతో అతడు మృతి చెందాడు. అతని మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతని వ్యక్తిగత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగా చనిపోయాడని కొందరంటే.. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అతడు.. డ్రగ్స్ కు బానిసవడంతో ఇలా జరిగిందని మరికొందరు వాదించారు.