BTS BAND | బీటీఎస్ బ్యాండ్... పాప్ మ్యూజిక్ సంచలనం...
బీటీఎస్ బ్యాండ్... పాప్ మ్యూజిక్ లవర్స్‌కు పరిచయం అక్కరలేని పేరు . ఈ సౌత్ కొరియన్ బ్యాండ్‌కు ప్రపంచం నలుమూలల అభిమానులు ఉన్నారు.తమ మ్యూజిక్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్ని పరవశింపజేస్తోంది ఈ మ్యూజిక్ బ్యాండ్. 2013లో ఏడుగురు సభ్యులతో చిన్న గదిలో ఈ మ్యూజిక్ బ్యాండ్ ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ బ్యాండ్‌గా బీటీఎస్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నది. ఈ బీటీఎస్ బ్యాండ్ అభిమానుల మనసుల్ని గెలుచుకోవడానికి కారణాలేమిటంటే..
సంగీతాన్ని విశ్వమానవభాషగా చెబుతుంటారు. దేశాల మధ్య ఉన్న హద్దుల్ని చెరిపివేస్తూ మనుషుల్ని కలిపే శక్తి మ్యూజిక్ ఉంటుంది . బీటీఎస్ బ్యాండ్ ప్రయాణాన్ని అందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. కాలేజీ కుర్రాళ్లు నుండి సినిమా స్టార్స్ వరకు...అమెరికా నుంచి అమలాపురం కుల, మత, జాతి, వయో భేదాలతో సంబంధం లేకుండా ఈ సౌత్ కొరియన్ బ్యాండ్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సంగీతప్రపంచంలో బీటీఎస్ బ్యాండ్ ది ప్రత్యేక అధ్యాయంగా చెప్పవచ్చు.
ఏడుగురు సభ్యులతో మొదలు
2013 లో ఈ బ్యాండ్ ప్రారంభమయ్యే నాటికి అందులోని సభ్యులు ఎవరికీ ఇరవై ఏళ్ల వయసు కూడా నిండలేదు. సంగీతంపై ఉన్న ప్రేమ వారిని కలిపింది. బీటీఎస్ అంటే బ్యాంగటన్ బాయ్స్ అని అర్థం. తమపై వచ్చే రూమర్స్, గాసిప్స్ తట్టుకొని ధైర్యంగా నిలబడాలనే ఆలోచనతో బుల్లెట్‌ఫ్రూఫ్ బాయ్స్ స్కౌట్ అనే అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టారు. బీటీఎస్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ర్యాప్ మోన్‌స్టర్ (ఆర్ ఎమ్) ఈ బీటీఎస్ బ్యాండ్‌కులీడర్. మిగతా సభ్యులు సుగా, జేహోఫ్, వీ, జిన్, జంగ్‌కుక్ కూడా పాటలు రాయగలరు, పాడగలరు. డ్యాన్స్ లు చేయగలరు. ఇందులోని ప్రతీసభ్యుడు మల్టీటాలెంటెండ్‌గా పేరుతెచ్చుకున్నారు. తొలినాళ్లలో బీటీఎస్ బ్యాండ్ ఎన్నో అవహేళనల్ని, అవమానాల్ని ఎదుర్కొన్నది. పాటలు పాడటం, రాయడం రాదనే విమర్శలు వచ్చాయి.
25 గిన్నిస్ రికార్డులు...
2014 లో రిలీజ్ అయినా బాయ్స్ ఇన్ లవ్ ఆల్బమ్ తో వారి కష్టాలు తొలగిపోయాయి. సౌత్ కొరియాలో ఈ ఆల్బమ్ హిట్ కావడంతో బీటీఎస్ వెనుదిరిగి చూడలేదు. డార్క్ అండ్ వైల్డ్, బీ, లవ్ యువర్ సెల్ఫ్ టియర్, ది మోస్ట్ బ్యూటిఫుల్ మూవ్‌మెంట్స్ ఇన్‌లైఫ్, వింగ్స్ ఆల్బమ్స్ దేశవిదేశాల్లో అత్యధికంగా అమ్ముడుపోయాయి. మ్యూజిక్ ఛార్ట్ లలో టాప్ పొజీషన్స్ లో నిలిచాయి. 2019 లో అమెరికన్ పాప్ సింగర్స్ తో కలిసి బీటీఎస్ బ్యాండ్ రిలీజ్ చేసిన బాయ్ విత్ లవ్ ఆల్బమ్ రికార్డులు బ్రేక్ చేసింది. మరో మ్యూజిక్ ఆల్బమ్ డైనమైట్ కు ఆ రోజుల్లోనే ఇరవై నాలుగు గంటల్లో వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జపాన్ భాషలో యూత్, వేక్ ఆప్ ఆల్బమ్స్ చేశారు. బీటీఎస్ సభ్యులు సోలోగా పలు సింగిల్ సాంగ్స్ చేసి శ్రోతల్ని అలరించారు. వీరి ప్రతి పాట బిల్ బోర్డ్ లలో చార్ట్ బాస్టర్ గా నిలిచింది. సౌత్ కొరియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్స్ వీరివేకావడం గమనార్హం. ఈ బ్యాండ్ పేరు మీద ఇరవై ఐదు గిన్నిస్ బుక్ రికార్డ్‌లు ఉన్నాయి. వీరు సిద్దం చేసిన బటర్ ఆల్బమ్ నిమిషంలోనే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సాధించింది. ఒకటేమిటి అనేక ఘనతల్ని వారు సొంతం చేసుకున్నారు.
అన్ని జోనర్స్ లో పాప్ ఆల్బమ్స్...
పాప్ సంగీతంలో గాయనీగాయకులు తమకు పట్టున్న జోనర్స్‌లోనే పాటల్ని స్వరపరచి ,శ్రోతల్ని అలరిస్తుంటారు. అరుదుగా ప్రయోగాలు చేస్తుంటారు. కానీ బీటీఎస్ బ్యాండ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం అని చెప్పవచ్చు. ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా పాప్, ఈడీఎమ్, లాటిన్ పాప్, అర్బన్, హిప్ హాప్, ఏమో రాక్, డ్యాన్స్ పాప్, బల్లాడ్ ఆర్ అండ్ బీ, జాజ్ హెవీ మెటల్ అన్ని జోనర్స్‌లో ఆల్బమ్స్ చేసి వైవిధ్యతను చాటుకున్నారు. ఆ విశిష్టతే బీటీఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది. పాప్ (బాయ్ విత్ లవ్, డింపుల్) ఈడీఎమ్ (డీఎన్ఏ, సో వాట్), ఆర్ అండ్ బీ(హోల్డ్ మీ టైట్) అర్బన్ (ఐ నీడ్ యూ) అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బ్యాండ్ ప్రారంభమైన ఐదేళ్ల వరకు కొరియన్, జపాన్ భాషల్లోనే పాప్ ఆల్బమ్స్ చేసిన వీరు 2018 నుంచి ఇంగ్లీష్ లో పాటల్ని కంపోజ్ చేయడం మొదలుపెట్టారు.
నో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్
యువతను ఆకట్టుకునే పదాలు, అశ్లీలత, డబుల్‌మీనింగ్ డైలాగ్‌లతో సాహిత్యాన్ని రాసి డబ్బులు సంపాదించుకోవాలని బీటీఎస్ బ్యాండ్ ఏ రోజు ప్రయత్నించలేదు. వారి ప్రతి పాటలో నిగూఢమైన అర్థాలు, జీవనసత్యాలు, అనిశ్చితి కనిపిస్తాయి. కష్టాల్ని, అవరోధాల్ని ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కోవాలో చాటిచెబుతుంటాయి. ముఖ్యంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, మహిళా సాధికారతను చాటుతూ చాలా ఆల్బమ్స్ రాశారు. ఆ శైలి కూడా బీటీఎస్ బ్యాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.
విలాసాలకు దూరం
బీటీఎస్ బ్యాండ్ ప్రారంభించిన తొలినాళ్లలో వారికి వచ్చే ఆదాయంతో రోజువారి జీవితం గడవటమే కష్టంగా ఉండేది. చిన్న ఇరుకు గదిలో ప్రారంభమైన బీటీఎస్ నేడు ప్రపంచంలోనే రిచెస్ట్ బ్యాండ్‌గా అవతరించింది. మ్యూజిక్ ఆల్బమ్స్, లైవ్ షోల ద్వారా ఇప్పటివరకు వారు 1400 కోట్ల రూపాయల్ని ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. బ్యాండ్ లో ఒక్కో సభ్యుడు ఏడాదికి యాభై కోట్లవరకు సంపాదిస్తుంటారు. అయినా మిగతా పాప్ సింగర్స్ పోలిస్తే విలాసాలు, ఆడంబరాలకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు బీటీఎస్ బ్యాండ్ సభ్యులు. తాము సంపాదించిన మొత్తంలో ఎక్కువభాగాన్ని ఛారిటీ, సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. బీటీఎస్ బ్యాండ్ సభ్యుడైన సుగా విద్యాసదుపాయాల కల్పన, విపత్తులు కోసం వందల మిలియన్లు సాయం చేశాడు. మరో సభ్యుడు జిన్ కూడా చిన్నారుల హక్కుల సంరక్షణ కోసం యూనిసెఫ్ తరఫున పనిచేస్తున్నాడు. అమెరికా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బీఎటీఎస్ బ్యాండ్ గళం విప్పింది.
లింగ వివక్షపై పోరాటం..
బీటీఎస్ బ్యాండ్ లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది. పలు మ్యూజిక్ వీడియోలో, లైవ్ పోగ్రామ్స్ లలో మహిళ దుస్తులు, మేకప్ ధరించి బీటీఎస్ బ్యాండ్ సభ్యులు కనిపించారు. మహిళల దుస్తులను ధరించడానికి వారు ఏ రోజు సంకోచించలేదు. కొరియాలో మాత్రమే కాదు విదేశీ టూర్స్ లలో మహిళల మాదిరిగా మేకప్ ధరిస్తుంటారు. సమానత్వానికి చాటాలన్నది వారి ప్రధాన ఉద్దేశమని ఫ్యాన్స్ అంటుంటారు.
సెలిబ్రిటీల జీవితాలపై ఆల్బమ్స్
సాధారణంగా సెలిబ్రిటీలు తాము ఎదుర్కొనే డిఫ్రెషన్‌తో పాటు ఇతర మానసిక సమస్యల గురించి బయటకు వ్యక్తంచేయడానికి సంకోచిస్తుంటారు. కానీ బీటీఎస్ బ్యాండ్ మాత్రం విమర్శలను పట్టించుకోకుండా సెలిబ్రిటీల జీవితంలోని ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరిస్తూ బ్లాక్ స్వాన్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. భయాన్ని జయించినప్పుడే ఆనందాల్ని పొందగలమని చాటిచెప్పారు.