Chiranjeevi on Ranga Marthanda: ఇదో 'త్రివేణి సంగమం'లా అనిపించింది.. 'రంగమార్తండ'పై చిరంజీవి ప్రశంసల వర్షం
Chiranjeevi on Ranga Marthanda: కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తండ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఓ త్రివేణి సంగమంలా అనిపించిందని, అద్భుతంగా ఉందని కొనియాడారు.
Chiranjeevi on Ranga Marthanda: టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తండ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది కానుకగా మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు సర్వత్రా పాజివిట్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల నుంచి సానుకూల స్పందన లభించింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి తన వంతు ప్రయత్నంగా మద్దతు ఇస్తున్నారు. వాయిస్ ఓవర్ ఇవ్వడం నుంచి మూవీ విడుదలైనంతవరకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ట్విటర్ వేదికగా పోస్టును పెట్టారు.
"రంగమార్తండ చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ఇది అద్భుతమైన చిత్రం. ప్రతి ఆర్టిస్టుకు తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్న భావన కలుగుతుంది. ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. క్రిష్ణవంశీ లాంటి క్రియేటివ్ దర్శకుడు, ప్రకాష్ రాజ్ లాంటి ఉత్తమ జాతీయ నటుడు, హాస్య బ్రహ్మానందం.. వారి పనితనం, ముఖ్యంగ ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇలాంటి ఉద్విగ్నభరితమైన పాత్ర చేయడం ఇదే తొలిసారి. సెకాండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కన్నీరు వచ్చేసింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు" అని చిరంజీవి పేర్కొన్నారు.
రంగమార్తండ చిత్రం మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ పతాకంపై కలిపు మధు, ఎస్ వెంకట రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాపిక్